నాలుగు నెలలైనా టైగర్ ను పట్టుకోలే.. మహారాష్ట్ర టీమ్ వెనక్కి

నాలుగు నెలలైనా టైగర్ ను పట్టుకోలే.. మహారాష్ట్ర టీమ్ వెనక్కి

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో ఇద్దరిని చంపి, మ్యాన్​ఈటర్ గా మారిన పెద్దపులిని పట్టుకోవడంలో  ఫారెస్ట్ ఆఫీసర్లు ఫెయిల్ ​అయ్యారు. మహారాష్ట్ర నుంచి స్పెషల్​టీమ్స్​రప్పించి,  ‘ఆపరేషన్ టైగర్ ’ పేరుతో పదిలక్షలు ఖర్చు చేసి నాలుగు నెలలపాటు నానా హడావిడి చేసినా ఫలితం దక్కలేదు. బెజ్జుర్ అటవీ ప్రాంతంలో మకాం వేసి, మంచెలు, బోన్లు పెట్టి పశువులను ఎరగా వేసినా పులి చిక్కలేదు. కానీ అదే టైంలో అటవీ సమీప గ్రామాల్లో పులి దాడులు ఆగలేదు. నిత్యం ఏదోచోట పశువులపై దాడులు చేయడం, పొలం పనులకు వెళ్లేవాళ్ల కంటపడి, భయపెట్టడం మానలేదు. చివరికి మహారాష్ట్ర నుంచి పులిని పట్టేందుకు వచ్చిన స్పెషల్​టీమ్​లు వెనక్కి వెళ్లిపోవడంతో గిరిజనులు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఇంకా భయం గుప్పిట్లోనే జనం

గతేడాది నవంబర్ 11న దహేగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేశ్, నవంబర్ 29 న పెంచికల్ పేట్ మండలం కొండపల్లి కి చెందిన గిరిజన బాలిక పసుల నిర్మలను పెద్దపులి చంపేసింది. దీంతో దహేగాం, పెంచికల్ పేట్, బెజ్జూర్, చింతలమానేపల్లి అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలు భయంతో వణికిపోయారు. ఏ క్షణంలో పులి దాడి చేస్తుందో తెలియక దాదాపు నెల రోజులపాటు పొలం పనులు, అటవీ ఉత్పత్తుల సేకరణ మానేసి ఇండ్లకే పరిమితమయ్యారు. ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా వెళ్లి భయంభయంగానే పనులు చేసుకొని ఇండ్లకు వస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లడం ఎప్పుడో మానేశారు. మ్యాన్​ఈటర్​ను వెంటనే పట్టుకొని తమకు రక్షణ కల్పించాలని డిమాండ్​చేస్తూ పలుసార్లు ఆందోళనకు దిగారు. సర్కారు ఆదేశాలతో ఫారెస్ట్​ ఆఫీసర్లు మహారాష్ట్ర నుంచి స్పెషల్​టీమ్​లు రప్పించి పది లక్షలు ఖర్చు చేసి నాలుగు నెలలపాటు హడావిడి చేశారు. ప్రత్యేక బృందాలతో పాటు 120 లోకల్​ఫారెస్ట్​ఆఫీసర్లు, స్టాఫ్​పులిని పట్టుకునేందుకు బోన్లు, ఎరలు పెట్టి ఎన్నో ప్రయత్నాలు చేసినా పులి చిక్కలేదు. ఇలా ఓవైపు పులిని పట్టుకునే కార్యక్రమం కొనసాగుతుండగానే మరోవైపు పులి గ్రామాల మీద పడి పెద్దసంఖ్యలో పశువులను చంపుతూ వచ్చింది. తీరా పులిని పట్టుకునేందుకు వచ్చిన మహారాష్ట్ర టీమ్​లు వెనక్కివెళ్లిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

ఇంకెప్పుడు పట్టుకుంటరు?

మా ఊరు జంగల్​కు దగ్గర ఉన్నది. ఎవుసం పనులకు, పశువులు మేపడానికి అడవికి పోతుంటం. ఈ పులి వల్ల  అడుగు బయట పెట్టాలంటే భయమైతంది. అట్లా అని ఇంట్ల కూసుంటే బతికేదెట్ల? పులిని పట్టుకుంటమని నాలుగు నెలల నుంచి జంగ్లాతోళ్లు చెబుతనే ఉన్నరు. ఇంకెప్పుడు పులిని పట్టుకుంటరు?
–డొకె వెంకన్న, రైతు, ఖర్జి, దహెగాం