
సీసీ కెమెరాలు.. ప్రత్యేక బోన్లు, పది మందితో 2 బృందాలు.. ట్రైనింగ్ పొందిన జాగిలం, వేటగాళ్లు… చేయని ప్రయత్నమంటూ లేదూ! అయినా, ఆ చిరుతపులి దొరికితేనా..? అధికారుల చేతికి చిక్కితేనా..? 5 నెలల్లో 35 జంతువులను చంపి తినేసిన ఆ చిరుత వాళ్లతో ఓ ఆట ఆడేసుకుంటోంది. పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసురుతోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ ఏడాది జనవరి 2న ఓ మేకల మందపై చిరుత దాడి చేసింది. జనం భయపడ్డారు. అధికారులకు చెబితే.. దాని కోసం వేట మొదలుపెట్టారు. అది తిరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టారు. 3 బోన్లు ఏర్పాటు చేశారు. వాటిలో కుక్కలు, మేకలు, గొర్రెలు మార్చి మార్చి పెట్టినా.. ‘నేను మోనార్క్ను.. నన్నెవరూ మోసం చేయలేరు’ అన్నట్టు బోను దాకా వచ్చి చుట్టూ తిరిగి వెళ్లిపోతోందే తప్ప దాంట్లోకి మాత్రం వెళ్లట్లేదు.
బోను గుట్టు దానికి తెలిసిపోయి ఉండొచ్చన్న ఉద్దేశంతో మరో 2 ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేయించినా ఫలితం మాత్రం శూన్యం. దీంతో మత్తు మందిచ్చి పట్టుకునేందుకు షూటర్లను అధికారులు తీసుకొచ్చారు. మూడు రోజులు రెక్కీ చేసినా దాని జాడ మాత్రం దొరకలేదు. చప్పుళ్లకు అడవిలోకైనా వెళుతుందన్న ఉద్దేశంతో అది తిరుగుతున్న చోట డప్పులు కొట్టిస్తున్నారు. బాంబులు పేలుస్తున్నారు. అయినా దానికి మాత్రం బెరుకు లేకుండా తిరుగుతోంది. నిజానికి ఏదైనా జంతువును చంపితే దాన్ని తినేందుకు రెండు మూడు రోజుల పాటు చిరుతపులి అక్కడే ఉంటుందని, కానీ, ఇది మాత్రం ఎప్పుడు ఎక్కడ ఉంటోందో అంతుబట్టట్లేదని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. చిరుతపులి భయానికి కొత్తపల్లి, మేడిపల్లి, నందివనపర్తి, తదితర గ్రామాల ప్రజలు పొలం వెళ్లాలంటేనే జంకుతున్నారు. పశువుల కొట్టాల చుట్టూ ముళ్ల కంచెలు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిరుత నల్లవెల్లి అటవీ ప్రాంతంలో ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఓ దూడను చంపింది. వారం క్రితమే దాని జాడను కనుగొనేందుకు గ్రామస్థులు, అటవీ అధికారులతో కూడిన 2 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు, వాళ్లు తిరిగేందుకు ఓ వాహనం కేటాయించారు. అలాగే, క్రూరమృగాల జాడను కనిపెట్టడంతో ప్రత్యేక శిక్షణ పొందిన బ్రౌని అనే కుక్కనూ అచ్చంపేట నుంచి తీసుకొచ్చారు. వన్యప్రాణి నిపుణుడు, షూటర్ రాజీవ్ మాథ్యూస్ సాయం కోరారు.