ఖైరతాబాద్, వెలుగు: ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడి, జైలుకు పోయి, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న వారి కోసం తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి, ప్రజా సంఘాల నాయకుడు గజ్జల కాంతం ప్రకటించారు. ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ ప్రక్రియను వేగవంతం చేసేలా సంఘం కృషి చేస్తుందన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. పదేండ్లు కొట్లాడితే తెలంగాణ వచ్చిందని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేసీఆర్ ఉద్యమకారులను మర్చిపోయారన్నారు. రేవంత్రెడ్డి సీఎం అవగానే ఉద్యమకారులను పట్టించుకోవడం అభినందనీయమన్నారు. స్థలంతోపాటు ఇల్లు కట్టుకోవడానికి రూ.25 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఉపేందర్, రాజేశ్, సుందర్ కృష్ణ పాల్గొని మాట్లాడారు.
