- నేడు స్వగ్రామం ప్రకాశం జిల్లా పావులూరులో అంత్యక్రియలు
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి(85) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో గల ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో శుక్రవారం మృతిచెందారు. వెంకటరెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు. శనివారం స్వగ్రామంలోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. వెంకటరెడ్డి ప్రజాసేవపై ఉన్న ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య మంత్రి వర్గాల్లో మంత్రిగా సేవలందించారు. 2004, 2009 లో బాపట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి, టీడీపీలో చేరారు. అనంతరం 2020లో వైసీపీలో జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి మృతికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం తెలిపారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశారని పీసీసీ చీఫ్ కొనియాడారు.
