
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లోకి వెళ్లినా అధిష్టానం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో తెలంగాణ ఉద్యమకారులెవరూ లేరన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలం పుంజుకుంటుందని గతంలో చెప్పానని, తాను చెప్పినట్లుగానే అదే నిజమైందని చెప్పారు. తన ప్రతిష్టతను దెబ్బతీసేందుకు సీఎం కేసీఆర్ మనుషులు సోషల్ మీడియాలో పని చేశారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ కు దూరమవుతాననే ఆవేదనతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్కమార్క వచ్చి తనతో మాట్లాడరని చెప్పారు. అందరం కలిసి పని చేయాలని కోరడానికి భట్టి వచ్చారన్నారు.
త్వరలో భవిష్యత్తు కార్యాచరణ
తనకు సీఎల్పీ కావాలని గతంలో అధిష్టానాన్ని అడిగానని, అయినా తనకు ఇవ్వకుండా మల్లు భట్టి విక్రమార్కకు ఇచ్చారని, ఈ విషయంలో మొదటి నుంచి భట్టికి పూర్తి సహకారం అందించానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తన నియోజకవర్గం ప్రజల అభిప్రాయ సేకరణ ప్రకారం త్వరలో నిర్ణయం తీసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలతో సమావేశమవుతానని చెప్పారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు కల్యాణ లక్ష్మీ చెక్కులు అందించే దుస్థితి నెలకొందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడుకు 10సార్లు వచ్చినా..తాను ఒక్కసారి వెళ్లినా ఒకటే అన్నారు. టీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ బయటకు వచ్చి బీజేపీలో చేరి, ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. అమిత్ షా, మోడీ ద్వయంతో కేంద్ర ప్రభుత్వం బలంగా ఉంటుందని హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ గెలిచారని చెప్పారు.
పార్టీ మార్పు విషయంలో కన్విన్స్ అవుతారనుకుంటా : భట్టి
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది కాంగ్రెస్ కుటుంబమని, సోనియాగాంధీ,రాహుల్ గాంధీపై వారికి చాలా గౌరవం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసీఆర్ పై సీరియస్ గా కొట్లాడుదామని తనతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ తోనే రాష్ట్ర ప్రయోజనాలు సాధ్యమవుతాయని చెప్పారు. వివిధ అభివృద్ధి పనుల దృష్ట్యా ఎమ్మెల్యేలు మంత్రులను కలుస్తారని, దాంట్లో ఎలాంటి తప్పు లేదన్నారు. పదవులను చాలా మంది నాయకులు కోరుకుంటారని, కానీ అవి కొందరికే వస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రజల లక్ష్యాల కోసం అందరం కలిసి పని చేద్దామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో చెప్పానన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టే తనతో మాట్లాడడానికి వచ్చానని, పార్టీ మార్పు విషయంలో కన్విన్స్ అవుతారని భావిస్తున్నానని చెప్పారు.