విషాదాన్ని నింపిన టీ20 ప్రపంచ కప్.. వెస్టిండీస్‌లో భారత క్రికెటర్ మేకప్ ఆర్టిస్ట్ మృతి

విషాదాన్ని నింపిన టీ20 ప్రపంచ కప్.. వెస్టిండీస్‌లో భారత క్రికెటర్ మేకప్ ఆర్టిస్ట్ మృతి

అమెరికా, వెస్టిండీస్‌ దేశాలు ఆతిథ్యమిస్తున్న 2024 టీ20 ప్రపంచకప్ మహా సమరం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ టీమ్‌లో భాగమైన పఠాన్‌తో కలిసి కరేబియన్‌ దేశానికి వెళ్లిన అతని వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ ఫయాజ్ అన్సారీ స్విమ్మింగ్ పూల్‌లో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జూన్ 21న జరగ్గా.. అన్సారీ సమీప బంధువు ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. 

అన్సారీ బిజ్నోర్‌లోని నగీనాకు చెందినవాడు. 22 ఏళ్ల క్రితం అన్సారీ సొంత ఊరిని వదిలి ముంబైకి వెళ్లి సొంత సెలూన్‌ ప్రారంభించాడు. కొంతకాలం తరువాత భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మేకప్ కోసం అతని సెలూన్‌ని సందర్శించేవాడు. తదనంతరం, మాజీ ఆల్ రౌండర్ అన్సారీని తన వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌గా నియమించుకున్నాడు. అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లాల్సిన సమయంలో అతనిని వెంట తీసుకెళ్లేవాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో స్పోర్ట్స్ కామెంటరీ టీమ్‌లో భాగంగా ఉన్న పఠాన్.. అతనిని వెంట తీసుకెళ్లగా విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. 

 ప్రమాదం జరిగిన సమయంలో అన్సారీ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్నట్లు తమకు తెలియజేశారని వెల్లడించారు. రెండు నెలల క్రితమే అతనికి వివాహమైనట్లు తెలుస్తోంది. అతని అకాల మరణం కుటుంబసభ్యులను కలిచివేసింది. అన్సారీ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి ఇర్ఫాన్ పఠాన్ ఏర్పాట్లు చేస్తున్నాడు. మూడు నాలుగు రోజుల్లో మృతదేహం ఢిల్లీకి చేరుకుంటుందని మృతుడి కుటుంబసభ్యులు వెల్లడించారు.