బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌..!

బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌..!

అందరూ అనుకున్నట్లే జరిగిందే. బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు కొత్త ప్రధాని ఎవరు..? అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. తెరపైకి చాలామంది పేర్లు వస్తున్నాయి. ప్రధాని రేసులో ఆర్థికశాఖ మాజీ మంత్రి రిషి సునాక్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈయన భారత సంతతి వ్యక్తి. 

వరుస వివాదాలు, సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు రావడం, మంత్రుల రాజీనామా చేయడంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. దీంతో తదుపరి ప్రధాని ఎవరా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో ఆర్థికశాఖ మాజీ మంత్రి రిషి సునాక్‌ పేరు వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే బ్రిటన్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించే అవకాశముంది. 

రిషి సునాక్‌ పూర్వీకులది పంజాబ్‌
రిషి సునాక్‌ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. ఆయన పూర్వీకులు పంజాబ్‌కు చెందిన వారు. ముందుగా తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్‌వీర్‌ కెన్యాలో, తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలసవెళ్లాక వివాహం చేసుకున్నారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేసిన రిషి సునాక్ .. మొదట్లో కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాతో పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

పరిపాలనలో ‘రైజింగ్‌ స్టార్‌’ మినిస్టర్‌గా గుర్తింపు 
చదువుకునే రోజుల్లో కన్జర్వేటివ్‌ పార్టీలో కొంతకాలం  రిషి సునాక్ ఇంటర్న్ షిప్ చేశారు. ఆ తర్వాత 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్‌మాండ్‌ నుంచి రిషి సునాక్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా మళ్లీ విజయం సాధించారు. 2019లో జరిగిన కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో రిషి.. బోరిస్‌ జాన్సన్‌కు మద్దతు ఇచ్చారు. దీంతో బోరిస్‌ ప్రధానిగా ఎన్నికైన తర్వాత రిషికి ఆర్థిక శాఖలో చీఫ్‌ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించారు. బోరిస్‌ జాన్సన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా సునాక్‌కు పేరుంది. తన వ్యక్తిత్వం, దూకుడు శైలితో ‘రైజింగ్‌ స్టార్‌’ మినిస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్‌గా పదోన్నతి కల్పించారు. అదే ఏడాది మార్చిలో రిషి సునాక్‌ పార్లమెంట్‌లో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. హిందువు అయినా సునాక్‌.. పార్లమెంట్‌లో ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేశారు.

రిషి సునాక్  భార్య అక్షతా మూర్తిపై పన్ను వివాదం
రిషి సునాక్  భార్య అక్షతా మూర్తిపై వచ్చిన పన్ను ఎగవేత ఆరోపణలు ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. అక్షత బ్రిటన్‌లో ‘నాన్‌-డొమిసైల్‌’ హోదాలో నివసిస్తున్నారు. ఆమెకు ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్‌లో ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదా ఇస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో తాము సంపాదించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ హోదాను అడ్డుపెట్టుకొని అక్షత.. పన్ను ఎగవేస్తున్నారని ప్రతిపక్షాల పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

కరోనా సంక్షోభం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సునాక్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కరోనా విజృంభణ సమయంలో ప్రజలు, ఉద్యోగులకు అండగా ఉండేందుకు అనేక పథకాలను ప్రకటించిన రిషి సునాక్.. ఖజానాపై భారం పడకుండా కొన్ని వర్గాలపై పన్నులు పెంచారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోయాయి. దీనికి రిషి నిర్ణయాలే కారణమని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.

ప్రధాని రేసులో ప్రముఖులు

ప్రధాని రేసులో రిషి సునాక్‌తో పాటు వాణిజ్య మంత్రి పెన్నీ మార్డాంట్‌ ముందంజలో ఉన్నారు. వీరితో పాటు రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, మాజీ ఆరోగ్య మంత్రి సాజిద్‌ జావిద్‌, ఆర్థికమంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నదీమ్‌ జహావీ, విదేశాంగ మాజీ మంత్రి జెరెమీ హంట్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బోరిస్‌ జాన్సన్‌పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ రిషి సునాక్‌ ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.