గుండెపోటుతో గోవా మాజీ సీఎం రవి నాయక్ మృతి

గుండెపోటుతో గోవా మాజీ సీఎం రవి నాయక్ మృతి

పనాజీ: గోవా మాజీ సీఎం, ప్రస్తుత వ్యవసాయ మంత్రి రవి నాయక్(79) గుండెపోటుతో మరణించారు. పనాజీకి 30 కి.మీ. దూరంలో ఉన్న అతని స్వస్థలం ఖడ్పబంద్‎లో మంత్రి రవి నాయక్​బుధవారం తెల్లవారుజామున గుండె పోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని పోండాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్‎మెంట్ ​పొందుతూ రవి నాయక్ మరణించారు. అనంతరం కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని పోండాలోని ఖడ్పబంద్​లోని ఇంటికి తరలించారు. 

రవి నాయక్​కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రవి నాయక్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గోవా అభివృద్ధి పథాన్ని సుసంపన్నం చేసిన అనుభవజ్ఞుడైన నాయకుడిగా, అంకితభావంతో కూడిన ప్రజా సేవకుడిగా ప్రజలకు ఆయన గుర్తుండిపోతారని ప్రధాని మోదీ ఒక సోషల్ మీడియా పోస్ట్‌‌‌‌లో అన్నారు. 

ఈ దుఃఖ సమయంలో రవి నాయక్ కుటుంబానికి, అనుచరులకు సానుభూతిని తెలిపారు. అలాగే, రవి నాయక్​మృతిపట్ల గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్, రాష్ట్ర కేబినెట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గోవా రాజకీయాల్లో నాయక్ ప్రముఖుడిగా, దశాబ్దాల పాటు అంకితభావంతో చేసిన సేవలు రాష్ట్ర పాలనపై చెరగని ముద్ర వేశాయని సీఎం పేర్కొన్నారు.