హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధాని చేయాలి: మాజీ గవర్నర్ విద్యాసాగర్​రావు

హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధాని చేయాలి: మాజీ గవర్నర్ విద్యాసాగర్​రావు

కరీంనగర్, వెలుగు : బంగారు తెలంగాణ కావాలంటే హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్​రావు అన్నారు. అంబేద్కర్ కూడా ఇదే కోరుకున్నారని గుర్తు చేశారు. ఇటీవల అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా ఇదే చెప్పారని తెలిపారు. కరీంనగర్​లోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్​లో విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడారు. దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయి తీరుతుందని, దీన్ని సాకారం చేసేందుకు అన్ని పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

‘‘నేను ఎంపీగా గెలిచి 25 ఏండ్లు పూర్తయ్యాయి. కరీంనగర్ కల్లోలిత జిల్లా కాదు.. కళకళలాడే జిల్లా. కరీంనగర్ అభివృద్ధికి అన్ని పార్టీలు కృషి చేశాయి. మోదీ పాలనలో దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. కరీంనగర్ నాకు జన్మభూమి, కర్మభూమి. కరీంనగర్ నుంచి కశ్మీర్ వరకు రైలు మార్గం ఉంటుందని ఆనాడు నేనిచ్చిన నినాదం నిజమైంది”అని విద్యాసాగర్​ అన్నారు.

అనుకున్నవన్నీ నిజమయ్యాయి

కరీంనగర్ పోరాటాలు బీజేపీకి మేలు చేశాయని, సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్న తన డిమాండ్ నిజమైందని విద్యాసాగర్​రావు అన్నారు. ‘‘గ్రామగ్రామానికి గోదావరి జలాలు”అనే తన నినాదం కూడా అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఇందులో అన్ని పార్టీల కృషి ఉందన్నారు. తెలంగాణ రాజకీయాల్లో తాను యాక్టివ్​గా లేనని, బీజేపీలో సభ్యుడిని మాత్రమేనని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ పేరిట ఓట్లన్నీ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్నాయని, కొన్ని ఓట్లు జాయింట్ అకౌంట్ లో కూడా ఉన్నాయన్నారు. వాటిని కూడా విడిపించుకోవాల్సిన సత్తా తమ నాయకులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.