
- గతంలో 66.78 లక్షల ఎకరాలే టాప్
- సీజన్ చివరలో ఆదుకున్న వర్షాలు
- పదేండ్లలో 3 రెట్లు పెరిగిన సాగు
- 5.38 లక్షల ఎకరాల సాగుతో నల్గొండ టాప్
- ఆ తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, నిజామాబాద్
- సీజన్‌లో అన్ని పంటలు కలిపి 132.65 లక్షల ఎకరాల్లో సాగు
హైదరాబాద్, వెలుగు: వరి సాగులో రాష్ట్రం ఆల్టైం రికార్డు సాధించింది. ఈసారి కాలం కలిసిరావడంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా మన రైతులు 67.04 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. గడిచిన 2024 వానాకాలం సీజన్‌లో 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, తాజాగా 67 లక్షల ఎకరాల మార్కును దాటేసింది. మరోవైపు ఈ సీజన్‌లో రికార్డుస్థాయిలో ఒక కోటి 32 లక్షల 66 వేల 422 ఎకరాల్లో అన్ని పంటలు సాగయ్యాయి. 100 శాతానికి పైగా పంటల సాగు నమోదైనట్టు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక అందించింది.
సీజన్చివరాఖరికి కలిసివచ్చిన కాలం..
జూన్ నెలలో నిరాశపరిచిన వర్షాలు.. జులై చివరి వారం నుంచి ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బావులు నిండాయి. ఫలితంగా రైతులు జోరుగా వరి నాట్లు వేశారు. భూగర్భజలాలు పెరగడంతో బావుల కింద కూడా వరి సాగును పెంచారు. దీంతో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటికే 67.04 లక్షల ఎకరాల వరి సాగైనట్ల వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 62.47లక్షల ఎకరాలు కాగా, 107.31శాతం సాగు నమోదు కావడం విశేషం. గత పదేండ్లలో వరి సాగు దాదాపు 3 రెట్లకు చేరుకున్నది.
ఆదిలాబాద్‌లో అత్యల్పంగా..
ఈ సీజన్‌లో వరి సాగులో నల్గొండ జిల్లా టాప్‌లో నిలిచింది. మొత్తం 5.38 లక్షల ఎకరాలతో మొదటి స్థానంలో ఉండగా, 4.66లక్షల ఎకరాలతో సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జిల్లాలు నాగార్జునసాగర్ఆయకట్టు పరిధిలోనివే కావడం విశేషం. నిజామాబాద్ జిల్లా ఈసారి 4.36 లక్షల ఎకరాలతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నది. ఆ తర్వాతి స్థానాల్లో సిద్దిపేట(3.60 లక్షల ఎకరాలు) , కామారెడ్డి (3.15 లక్షల ఎకరాలు), జగిత్యాల (3.12 లక్షల ఎకరాలు) , మెదక్ (3 లక్షల ఎకరాలు), ఖమ్మం (2.94 లక్షల ఎకరాలు), యాదాద్రి (2.82 లక్షల ఎకరాలు) నిలిచాయి. కాగా, ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే కేవలం2,375 ఎకరాల్లో అత్యల్పంగా వరి సాగైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సైతం ఈ సారి 17,646 ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదికలో వెల్లడించింది.
వరి మినహా మిగతా పంటల సాగు ఇలా..
ఈ వానాకాలం సీజన్‌లో 45.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. జూన్, జులై నెలలో పత్తి సాగుకు అనుకూల వాతావరణం ఉండగా.. జులై ప్రారంభం నుంచి ఆగస్టు నెల వరకు కురిసిన అధిక వర్షాల వల్ల పంటసాగుపై ఎఫెక్ట్ పడింది. దీంతో టార్గెట్‌లో 93.71 శాతానికే పరిమితమైంది. ఈ వానాకాలం పంటసాగులో 79.63 లక్షల ఎకరాల్లో ఫుడ్‌గ్రెయిన్స్ సాగయ్యాయి. కంది ఇప్పటివరకు 4.91లక్షల ఎకరాల్లో, సోయాబీన్ సాధారణ సాగు 4.20 లక్షలు కాగా ఈసారి 3.62లక్షల ఎకరాలకు పరిమితమైంది. మక్కజొన్న సాధారణ సాగు 5.21లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 6.41 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇలా వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 100.17 శాతం సాగు నమోదైంది.
పంటలన్నింటిలోనూ నల్గొండే ఫస్ట్
ఈ వానాకాలం సీజన్‌లో అన్ని పంటలు కలిపి 132.65 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ తేల్చింది. ఈసారి 11.13 లక్షల ఎకరాలతో అన్ని పంటల్లోనూ నల్గొండ టాప్‌లో నిలిచింది. అలాగే, 7.29 లక్షల ఎకరాలతో సంగారెడ్డి సెకండ్ ప్లేస్‌లో ఉన్నది. కాగా, 6.33 లక్షల ఎకరాలతో ఖమ్మం థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.