
- త్వరలో డీపీఆర్.. టెండర్లు
- మార్కింగ్ పనులు షురూ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్(ట్రిపుల్ ఆర్)ను ఔటర్ రింగ్ రోడ్‌తో లింక్ చేస్తూ పలు ప్రాంతాల్లో రేడియల్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. రేడియల్ నిర్మాణాల కోసం హెచ్ఎండీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. హెచ్ఎండీఏ పరిధి ఔటర్ నుంచి ట్రిపుల్ఆర్ వరకూ పెరగడంతో అక్కడి వరకు కనెక్టివిటీ రోడ్లను(రేడియల్) నిర్మించనుంది. అందులో భాగంగానే ఇప్పటికే మొదటి రోడ్‌ను ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 13 నుంచి రావిర్యాల మీదుగా ఆమన్‌గల్ వరకు నిర్మించనున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియను కూడా హెచ్ఎండీఏ పూర్తి చేసింది. తాజాగా శంషాబాద్ నుంచి పరిగి వరకు 55 కి.మీ. రేడియల్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. త్వరలోనే డీపీఆర్ పూర్తి చేసి టెండర్లను ఆహ్వానించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రేడియల్ రోడ్‌కు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అధికారులు మార్కింగ్ పనులు కూడా చేపడుతున్నారు.
మొదట రావిల్యాల మీదుగా ఆమన్‌గల్ వరకు..
ట్రిపుల్ ఆర్ పరిధిలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, ఆమన్‌గల్, యాచారం, కందుకూరు, షాద్‌నగర్, చేవెళ్ల, కంది వరకు దాదాపు 11 రోడ్లను నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. రేడియల్ రోడ్లను నిర్మించి ఆయా ప్రాంతాలకు ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్కు లింక్ చేస్తారు. ఇందులో భాగంగా మొదటి దశలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి రావిర్యాల మీదుగా ఆమన్‌గల్ వరకు రేడియల్ రోడ్‌ను నిర్మించనున్నారు. దాదాపు 42 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రోడ్డు పరిధిలోకి కొంగర కుర్ధు, కొంగర కలాన్, ఫిరోజ్‌గూడ, లేమూరు, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడివెల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట, ముచ్చర్ల, కుర్మిద్ద, కడ్తాల్ నుంచి ఆమన్‌గల్ అనుసంధానం అవుతాయి. దీంతో ఆయా ప్రాంతాలను డెవలప్ చేసేలా హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది.
శంషాబాద్– పరిగి మార్కింగ్ షురూ..
తాజాగా శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 17 నుంచి పరిగి ఓఆర్ఆర్ వరకు 55 కిలోమీటర్ల రేడియల్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ హుడా కాలనీ అండర్‌పాస్ వద్ద ప్రారంభమై వికారాబాద్ రాకంచర్ల వరకు విశాలమైన రేడియల్ రోడ్‌ను నిర్మించనున్నారు. ఈ రహదారి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని నాలుగు మండలాలు, 24 గ్రామాలను కలుపనుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 2, 4, 8, 10, 13, 15, 17 రహదారులకు సంబంధించి ప్రణాళికను హెచ్ఎండీఏ రెడీ చేసింది. త్వరలో రెండో రేడియల్ రోడ్‌కు సంబంధించి టెండర్లను ఆహ్వానించనున్నట్టు అధికారులు తెలిపారు.
భూసేకరణకు నిర్ణయం..
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, షాబాద్ మండలాల్లోని శంషాబాద్, కొత్వాల్‌గూడ, అమ్మపల్లి, నర్కుడా, సుల్తాన్‌పల్లి, కాచారం, రాయన్నగూడ, మల్కారం, రామాంజపూర్, సోలిపేట, హైతాబాద్, పెద్వీడు, దామర్లపల్లి, మాచన్‌పల్లి, నాగర్‌కుంట, బోన్గిరిపల్లి, షాబాద్, కొమరబండ, ఉబ్బగుంట, బొబ్బిలిగాం, వికారాబాద్ పరిధిలోని పరిగి, పూడూర్, కంకల్, మాచన్‌పల్లి, పరిగి, మాదారం, రాకంచర్ల తదితర గ్రామాల గుండా రేడియల్ నిర్మాణం జరగనుంది. ఆయా ప్రాంతాల్లో అవసరమైన భూములను కూడా రైతుల నుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు.
రేడియల్ రోడ్డు మాకొద్దు
పరిగి, వికారాబాద్, వెలుగు: పరిగి నుంచి శంషాబాద్ వరకు రేడియల్ నిర్మాణం తమకు అవసరం లేదని రైతు వేదికలో రైతులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రేడియల్‌లో భూములు కోల్పోతున్న రైతులు శుక్రవారం రంగాపూర్ రైతువేదిక క్లస్టర్ ఎదుట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రోడ్డు నిర్మాణం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. శంషాబాద్ నుంచి నాగర్‌గూడ వరకు, షాద్‌నగర్ నుంచి పరిగి వరకు ఆరు లేన్ల రోడ్డు వేస్తే రైతులు నష్టపోతారన్నారు. మరోవైపు ట్రిపుల్ ఆర్‌లో తమ భూములు పోకుండా చూడాలని కోరుతూ నవాబుపేట మండల చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు.