
- 387 పాయింట్లు పడ్డ సెన్సెక్స్
- నికర కొనుగోలుదారులుగా
- మారిన ఎఫ్‌ఐఐలు
ముంబై: వరుసగా మూడు రోజుల పాటు లాభాల్లో ముగిసిన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ, శుక్రవారం నష్టాల్లో కదిలాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూ-చిప్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో సెన్సెక్స్ 387 పాయింట్లు పడింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల నుంచి అదానీకి సెబీ క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఈ గ్రూప్ కంపెనీలు పెరిగాయి. 30 షేర్ల సెన్సెక్స్ శుక్రవారం 0.47 శాతం తగ్గి 82,626.23 వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో ఇది 528.04 పాయింట్లు లేదా 0.63 శాతం తగ్గి 82,485.92కి చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 96.55 పాయింట్లు లేదా 0.38 శాతం తగ్గి 25,327.05 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాల్లో ప్రాఫిట్ బుకింగ్‌తో షేర్లు పడిపోయాయి. అయితే ఎనర్జీ, రియల్టీ, మెటల్ రంగాల్లో షేర్లు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ కంపెనీలలో హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ట్రెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టపోగా, అదానీ పోర్ట్స్, భారతి ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, సన్ ఫార్మా షేర్లు పాజిటివ్‌గా క్లోజయ్యాయి. “యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో మార్కెట్ వరుస సెషన్లలో పెరిగింది. తాజాగా ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో పడింది. యూఎస్–ఇండియా వాణిజ్య చర్చలు, గ్లోబల్‌గా లిక్విడిటీ మెరుగవ్వడంతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పెరిగింది” అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఈ వారం సెన్సెక్స్ 722 పాయింట్లు జూమ్
బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ శుక్రవారం 0.16 శాతం పెరగగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.09 శాతం తగ్గింది. సెక్టోరల్‌గా చూస్తే, కన్స్యూమర్ డ్యూరబుల్స్ (–0.52శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (–0.42శాతం), ఎఫ్‌ఎంసీజీ (–0.39శాతం), ఫోకస్డ్ ఐటీ (–0.39శాతం), ఐటీ (–0.30శాతం), ఆటో (–0.27శాతం) ఇండెక్స్‌లు నష్టాల్లో ముగిశాయి. యుటిలిటీస్ (+1.56శాతం), పవర్ (+1.30శాతం), ఆయిల్ అండ్ గ్యాస్ (+0.67శాతం), రియల్టీ (+0.46శాతం), టెలికం (+0.40శాతం) ఇండెక్స్‌లు లాభపడ్డాయి.
మొత్తంగా ఈ వారాన్ని సెన్సెక్స్ 721.53 పాయింట్లు లేదా 0.88 శాతం లాభంతో, నిఫ్టీ 213.05 పాయింట్లు లేదా 0.84 శాతం లాభంతో ముగించాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) గురువారం నికరంగా రూ.366.69 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, శుక్రవారం మరో రూ.390 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు బలపడి 88.11 వద్ద ముగిసింది.
ఆసియా మార్కెట్లు నష్టాల్లో..
ఆసియా మార్కెట్లలో కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్‌ఎస్‌ఈ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. హాంకాంగ్ హాంగ్‌సెంగ్ లాభపడింది. యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగియగా, శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.55 శాతం తగ్గి 67.07 డాలర్లకి చేరింది.