18 శాతం నిధులు కేటాయిస్తే.. దళితుల సమస్యలన్నీ తీరుతయ్:మంత్రి వివేక్ వెంకటస్వామి

18 శాతం నిధులు కేటాయిస్తే.. దళితుల సమస్యలన్నీ తీరుతయ్:మంత్రి వివేక్ వెంకటస్వామి
  • దళితుల అభివృద్ధికి కాకా ఎంతో కృషి చేశారని వెల్లడి
  • రవీంద్ర భారతిలో దళిత జర్నలిస్టుల ఫోరమ్ మహాసభకు హాజరు

హైదరాబాద్, వెలుగు: దళితుల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బడ్జెట్​లో దళితులకు 18% నిధులు కేటాయిస్తే.. వారి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఇదే అంశాన్ని తాను పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

శుక్రవారం రవీంద్ర భారతిలో దళిత జర్నలిస్టుల ఫోరమ్ మహాసభ జరిగింది. ఈ మీటింగ్ కు చీఫ్ గెస్ట్ గా మంత్రి వివేక్ వెంకటస్వామి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధికి కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారని.. ఆయన ఆశయాలకు తగ్గట్టుగా తాను పనిచేస్తానన్నారు. దళితుల సమస్యలు, పరిష్కార మార్గాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగిందని.. ఆ సమస్యలన్నింటిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానన్నారు. 

ఈ మీటింగ్ ద్వారా దళిత సోదరులను కలుసుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. మన హక్కులను సాధించుకోవాలని.. ఇందుకు అందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని సూచించారు. గత పదేండ్లు కేసీఆర్ చేసిన అప్పులతో రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం పడిందని, దీంతో హామీల అమలు కొంత లేట్ అవుతున్నదని.. అయినా, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ‘‘రైతుబంధు స్కీమ్ లో దళితులకు లబ్ధి జరగదని ఆ రోజే చెప్పాను. దళితులకు సొంతంగా భూమి ఉండదు. ఎక్కువ శాతం కౌలు భూమి ఉంటుంది. కౌలు రైతుల్లో 70 శాతం దళితులే ఉంటారు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వాల్సిందేనని నేను ప్రభుత్వాన్ని కోరాను’’అని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.