హెచ్‌సీఏకు నేనే ప్రెసిడెంట్.. నాకు అన్ని పవర్స్ ఉన్నయ్

హెచ్‌సీఏకు నేనే ప్రెసిడెంట్.. నాకు అన్ని పవర్స్ ఉన్నయ్

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవి నుంచి భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌‌ను తొలగించడం వివాదస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై అజారుద్దీన్ ఫైర్ అయ్యాడు. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌లో ఐదుగురు ఓ వర్గంగా ఏర్పడ్డారని అజార్ ఆరోపించాడు. వాళ్ల నిర్ణయమే అపెక్స్ కౌన్సిల్‌ నిర్ణయంగా చెబితే ఎలా అని ప్రశ్నించాడు. తనకు ఇచ్చిన నోటీసులు అక్రమమని విమర్శించాడు. అంబుడ్స్‌‌మన్ నియామకం సరైనదేనని హైకోర్ట్ కూడా చెప్పిందనీ.. కానీ హెచ్‌సీఏలోని ఓ వర్గం వ్యతిరేకిస్తోందన్నారు. 

బ్లాక్‌‌మెయిల్స్‌‌కు భయపడను
‘ప్రెసిడెంట్ అనుమతి లేకుండా హెచ్‌సీఏలో మీటింగ్‌‌లు ఎలా పెడతారు? హెచ్‌సీఏలో 25 ఏళ్లుగా అదే వ్యక్తులు ఉన్నారు. వాళ్లు ఎవ్వరినీ రానివ్వరు. వచ్చినా ఉండనివ్వరు. బ్లాక్ మెయిల్ చేస్తారు. వాళ్ల అవినీతికి అడ్డొస్తున్నాననే నాపై కుట్రలు పన్నుతున్నారు. వారిలో ఏ ఒక్కరికీ క్రికెట్ గురించి తెలియదు. నాకు క్రికెట్ అంటే ప్రేమ. క్రికెట్‌‌ను అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం. ఉప్పల్ గ్రౌండ్ ఎలా ఉందో చూడండి. నేను అధ్యక్షుడిగా అయినప్పుడు కనీస వసతులు కూడా లేవు. షెడ్ ఊడిపోయింది. గ్రౌండ్ నాశనం అయింది. మరి ఇన్నేళ్లు వీళ్లు హెచ్‌సీఏలో ఉండి ఏం అభివృద్ధి చేశారు? నేను ఎలాంటి బ్లాక్ మెయిల్స్‌‌కు భయపడను. ఏజీఎం మీటింగ్ పెట్టుకొని దీపక్ వర్మను అంబుడ్స్‌‌మన్‌‌గా నియమించుకున్నాం. అందరూ అంగీకారం తెలిపారు. కానీ పది నిమిషాల్లోనే నేను లేకుండా మరో మీటింగ్ పెట్టుకొని దీపక్ వర్మ నియామకం చెల్లదని నిర్ణయించుకున్నారు. హెచ్‌సీఏలో ఏం జరుగుతుందో బీసీసీఐకి తెలుసు. ఈ విషయాలు బోర్డు దృష్టికి తీసుకెళ్తా’ అని అజార్ పేర్కొన్నారు. 

హెచ్‌‌సీఏ బాడీని డిసాల్వ్ చేస్తా
‘అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఇప్పటికే అంబుడ్స్‌‌మన్ నుంచి నోటీసులు వెళ్లాయి. ప్రస్తుతం నేనే ప్రెసిడెంట్. నాకు అన్ని రకాల పవర్స్ ఉన్నాయి. బీసీసీఐతో మాట్లాడి హెచ్‌‌సీఏ బాడీని డిసాల్వ్ చేస్తా. ప్రస్తుతం దీపక్ వర్మనే హెచ్‌సీఏ అంబుడ్స్‌‌మన్‌‌గా ఉన్నారు. ఆయనను సుప్రీం కోర్టు నియమించింది. అత్యున్నత ధర్మాసనం నిర్ణయాన్ని గౌరవించాలి. దీపక్ వర్మ ఇప్పటికే నోటీసులు అందించారు. స్పందించకపోతే వాళ్లను డిసాల్వ్ చేసే అధికారం దీపక్ వర్మకు ఉంది. దుబాయ్‌‌లో జరిగిన టీ10 లీగ్‌‌లో ఒక టీమ్‌‌కు మెంటార్‌‌గా వ్యవహరించానని ఆరోపిస్తున్నారు. అది నిజమే. కానీ అది ఇండియా బయట జరిగిన లీగ్ అది. అలా ఉండొద్దని ఎక్కడా లేదు. ఒకవేళ ఉంటే బీసీసీఐ అభ్యంతరం చెప్పడమో, నోటీసులు పంపడమో చేస్తుంది. బీసీసీఐకి లేని సమస్య వీళ్లకెందుకు?’ అని అజారుద్దీన్ ప్రశ్నించారు.