ఆఫ్ఘనిస్తాన్‌లో పుట్టి..టీమిండియాకు ఆడాడు

ఆఫ్ఘనిస్తాన్‌లో పుట్టి..టీమిండియాకు ఆడాడు

టీమిండియా మాజీ క్రికెటర్  సలీం దురానీ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సలీం దురానీ..ఏప్రిల్ 2వ తేదీన ఆదివారం ఉదయం గుజరాత్లోని జమ్నానగర్‌లోని తన ఇంట్లో చనిపోయారు. దురానీ టీమిండియా తరపున మొత్తం 29 టెస్టులు ఆడాడు. 1202 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 7 అర్థసెంచరీలున్నాయి. అంతేకాకుండా 75 వికెట్లు పడగొట్టాడు. దురానీ మృతి  పట్ల పలువురు మాజీ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.

కాబూల్లో పుట్టి టీమిండియాకు ..

ఆల్ రౌండర్ అయిన సలీం దురానీ 1934 డిసెంబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో జన్మించాడు. అయితే దురానీకి 8 నెలల వయస్సప్పుడు అతని కుటుంబం పాకిస్తాన్‌లోని కరాచీలో స్థిరపడింది. ఆ తర్వాత దేశ విభజన జరిగిన సమయంలో దురానీ కుటుంబం భారతదేశానికి వచ్చింది. 

భారత క్రికెట్ చరిత్రలో దురానీ  అద్భుతమైన ఆల్‌రౌండర్‌. 1960లో ఆస్ట్రేలియాతో  ముంబైలో జరిగిన టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. 1961-62లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రేక్షకుల కోరిక మేరకు సిక్స్‌లు కొట్టడంలో దురానీ ఫేమస్ అయ్యాడు. సలీం దురానీ 1973 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో ముంబైలో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత 1973లో క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత  పర్వీన్ బాబీ అనే సినిమాలో నటించాడు.