ప్రియురాలికి 900 కోట్ల ఆస్తి.. ఇటలీ మాజీ పీఎం వీలునామా

ప్రియురాలికి 900 కోట్ల ఆస్తి.. ఇటలీ మాజీ పీఎం వీలునామా
  • ఇటలీ మాజీ పీఎం వీలునామా
  • గత నెలలో లుకేమియాతో చనిపోయిన బెర్లుస్కోని

రోమ్ : తాను ప్రేమించిన 33 ఏండ్ల మహిళకు ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ ఏకంగా రూ.900 కోట్ల ఆస్తి రాసిచ్చాడు. ఆయన చనిపోవడానికి ముందు రాసిన ఈ వీలునామాను ఇటీవలే ఆయన వారసులు, ఇతర సాక్షులు, మీడియా ఎదుట చదివి వినిపించడంతో ఈ విషయం బయటపడింది. మూడు సార్లు ఇటలీకి ప్రధానిగా పనిచేసిన బెర్లుస్కోనీ లుకేమియా డిసీజ్​తో బాధపడుతూ గత నెలలో చనిపోయారు. అంతకుముందు.. 86 ఏండ్ల బెర్లుస్కోనీ తనకన్నా 53 ఏండ్లు తక్కువున్న పొలిటీషియన్ మార్టా ఫాసినా అనే మహిళతో మూడేండ్లు ప్రేమాయణం కొనసాగించారు. ఇటలీ పార్లమెంట్ దిగువ సభలో మెంబర్ ​అయిన ఆమెను పెండ్లి చేసుకోకపోయినప్పటికీ భార్యగానే బహిరంగంగా చెప్పుకున్నారు. అందుకే చనిపోయేముందు వీలునామాలో ఆమె పేరిట 100 మిలియన్ యూరోలు(రూ.905 కోట్లు) ఆస్తి రాసి ఉంచారు. సిల్వియో స్థాపించిన ఫోర్జా ఇటాలియా పార్టీలోనూ ఆమె సభ్యురాలిగా ఉన్నారు.

ఇద్దరు భార్యలు, ఐదుగురు సంతానం

దేశంలోనే అతిపెద్ద బిజినెస్​ టైకూన్​ అయిన సిల్వియో బెర్లుస్కోని దాదాపు రూ.54 వేల కోట్లకు అధిపతి. దేశంలోనే అత్యంత సంపన్నులలో మూడో వ్యక్తి. అఫీషియల్​గా ఆయన ఇద్దరిని పెండ్లి చేసుకోగా, మరో ఇద్దరితో రిలేషన్ షిప్​ నడిపారు. సిల్వియో మొత్తం ఐదుగురి సంతానంలో పెద్ద కొడుకు పీర్ సిల్వియో, కూతురు మెరీనా వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుంటున్నారు. తన ఆస్తుల్లో ఎక్కువ భాగం పిల్లలకే పంచిన సిల్వియో, తన తమ్ముడైన పాలోకు రూ.900 కోట్లు,  తన పార్టీ ఫోర్జా ఇటాలియా తరఫున సెనేటర్​గా పనిచేసిన మార్సెలో డెలుట్రీకి 270 కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చారు.