- అప్పట్లో మిగిలిపోయిన తెలుగు పరీక్షకు అటెండ్
కోరుట్ల, వెలుగు: ఇటీవలే గన్ను వీడిన మాజీ మావోయిస్టు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మళ్లీ పెన్ను పట్టారు. 42 ఏండ్ల క్రితం ఇంటర్లో ఫెయిల్ అయిన తెలుగు పరీక్షను బుధవారం కోరుట్లలో రాశారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్జీ ప్రాథమిక విద్యను కోరుట్లలోనే పూర్తి చేశారు. ఇంటర్ కోసం 1982-83లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరారు. అప్పట్లో విప్లవ భావజాలానికి ఆకర్షితుడై స్టూడెంట్ రాడికల్ యూనియన్ (ఆర్ ఎస్ యూ)లో ఆర్గనైజర్ గా చేరాడు.
ఆ క్రమంలోనే దేవ్‌జీపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో చదువుకు ఆటంకం ఏర్పడింది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత దేవ్జీ అడవి బాట పట్టారు. సెంకడ్ ఇయర్ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయినప్పటికీ తెలుగు పరీక్షలో ఫెయిల్ అయ్యారు. మళ్లీ ఆ పరీక్ష రాసే అవకాశం దేవ్‌జీకి చిక్కలేదు.
42 ఏండ్ల తర్వాత ఇటీవలే జన జీవన శ్రవంతిలోకి వచ్చిన దేవ్జీ ఇంటర్ విద్యను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఇంటర్లో మిగిలిపోయిన తెలుగు పరీక్షకు సప్లిమెంటరీలో రాసేందుకు ప్రిపేర్ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ లోని ఎగ్జామ్ సెంటర్‌కు ప్యాడ్, హాల్ టికెట్‌తో వచ్చారు.
ఇంటర్ విద్యార్థులతో కలిసి తెలుగు పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలోకి వెళ్లినప్పుడు చదువు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మళ్లీ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇంటర్ పూర్తి చేసి న్యాయ విద్యను అభ్యసించాలనుకుంటున్నట్టు చెప్పారు. పేదలకు న్యాయ సహాయం అందించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.
