త్వరలోనే జమిలి ఎన్నికలు.. కేసీఆరే మళ్లీ సీఎం : ఎర్రబెల్లి దయాకర్ రావు

త్వరలోనే జమిలి ఎన్నికలు.. కేసీఆరే మళ్లీ సీఎం : ఎర్రబెల్లి దయాకర్ రావు
  • నన్ను ఓడించినందుకు జనమే బాధపడ్తున్నరు: ఎర్రబెల్లి దయాకర్

వరంగల్​సిటీ/జనగామ, వెలుగు: త్వరలో జమిలి ఎన్నికలు జరుగుతాయని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగిన దీక్షా దివస్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘వెయ్యి మంది బిడ్డలు వీరమరణం పొందిన తర్వాత కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. నాడు సోనియా గాంధీని బలి దేవత అన్న రేవంత్.. ఇప్పుడేమో పొగుడ్తున్నడు’’అని దయాకర్ రావు విమర్శించారు.

అనంతరం జనగామలో నిర్వహించిన దీక్షా దివస్​లో పాల్గొని మాట్లాడారు. ‘‘పాలకుర్తి అసెంబ్లీ టికెట్ మార్చాలని కేసీఆర్​కు చెప్పినా.. ఆయన వినిపించుకోలే.. అందుకే పాలకుర్తి ప్రజలు నన్ను మార్చేసిన్రు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని జనం నన్ను ఓడించిన్రు. ఇప్పుడు బాధపడ్తున్నరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం’’అని ఎర్రబెల్లి అన్నారు. నిజాయితీ గురించి మాట్లాడుతున్న కడియం శ్రీహరి.. పదవికి రాజీనామా చేసి గెలవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, భిక్షమయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.