18 ఏళ్లు చాకిరీ చేయించుకొని నా కళ్లలో మట్టి కొట్టిండు

18 ఏళ్లు చాకిరీ చేయించుకొని నా కళ్లలో మట్టి కొట్టిండు

జమ్మికుంట: తెలంగాణలో ఉద్యోగాలు రాక పల్లెల్లో ఏ కుటుంబాన్ని కదిలించినా దు:ఖమే కనిపిస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం ఇంతకాలం పెద్దోళ్లకు తప్ప పేదలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. పేదలకు అనారోగ్యం వస్తే ఆస్పత్రుల ఖర్చు భరించలేక కాటికి తప్ప ఇంటికి వచ్చే పరిస్థితి లేదన్నారు. పేదల విద్య, వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని ఎన్నోసార్లు చెప్పానన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ రెండు ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు.

దళిత అధికారుల మీద కేసీఆర్‌కు నమ్మకం లేదు
‘కేసీఆర్ నాతో18 ఏళ్ల పాటు చాకిరి చేయించుకుని కళ్లలో మట్టి కొట్టిండు. నేను రాజీనామా చేసిన తర్వాత మూడేళ్లుగా పెండింగ్‌‌లో ఉన్న గొర్రెలు పంపిణీ చేస్తున్నరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌‌లో గొర్రెలు దొరక్క.. ఇక్కడి యాదవులు తిండిదొరక్క ఇబ్బందులు పడుతున్నరు. ఈ గొర్రెలను రీస్లైక్లింగ్ చేస్తున్నరు. గొర్రెల సంపద పెరగడం లేదని యాదవులే చెబుతున్నారు. ఈ పథకాన్ని హేచరీస్ పెట్టి నిజంగా గొర్రెలు పెంచుకునే వాళ్లకే  ఇవ్వాలని చెబితే వినలేదు. ట్యాంక్ బండ్‌‌పై ఏడేళ్లలో అంబేడ్కర్‌కు పూల దండ కూడా వేయని కేసీఆర్.. ఇప్పుడు ప్రగతి భవన్‌‌లో దళితులకు భోజనం పెట్టి అంబేడ్కర్‌కు దండ వేసిండు. సీఎంవోలో దళిత, బీసీ, గిరిజన అధికారులు లేరు. వాళ్లకు తెలివి లేదని, వాళ్ల మీద నమ్మకం లేదని రానీయలేదు’ అని ఈటల పేర్కొన్నారు.  

పార్టీలు, జెండాలు పక్కనపెట్టి ఓటేయాలె
‘ఎన్నడూ లేనిది ఇప్పుడు కేసీఆర్ ఎందుకు బయటకొచ్చిండు? గడ్డిపోచలాగా పీకేస్తే పోతననుకున్న నేను.. గడ్డపారలాగా నిలబడేసరికి ఇదంతా చేస్తున్నడు. సిద్ధిపేటకు తీసుకెళ్లి ఉపన్యాసాలిచ్చి బువ్వ పెట్టి, ప్రలోభపెట్టి పంపిస్తున్నరు. అక్కడ నన్ను తిడుతుంటే.. బయటకు వచ్చి ఈటలకే ఓటేస్తామని చెప్పుకుంటున్నరు. ఇంటి మీద టీఆర్ఎస్ జెండా పెట్టుకుని, గులాబీ  కండువా వేసుకుంటేనే దళితులకు పది లక్షలు ఇస్తారంట. మిగతా వాళ్లకు రావట. దళిత మేధావుల్లారా ఓసారి ఆలోచించండి.. ఇది కేసీఆర్ సొమ్మా, ప్రజల సొమ్మా? ఇది ప్రజల సొమ్మే అయితే పేదలందరికీ ఆ డబ్బును అందించేలా ఒత్తిడి తీసుకురావాలి. వీళ్ల జేజమ్మ దిగొచ్చినా హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలవదు. ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా తీస్కొని నాకే ఓటేస్తారు. ఈసారి పార్టీలు, జెండాలు పక్కన పెట్టి నన్ను చూసి ఓటేయండి’ అని ఈటల కోరారు.