రూ.2 లక్షల రుణమాఫీ ఎట్ల చేస్తరో చూస్తం..వాళ్ల ఆట ఇప్పుడే మొదలైంది

రూ.2 లక్షల రుణమాఫీ  ఎట్ల చేస్తరో చూస్తం..వాళ్ల ఆట ఇప్పుడే మొదలైంది
  • కాంగ్రెస్​వి అలవి కాని హామీలు.. వాళ్ల ఆట ఇప్పుడే మొదలైంది: కేటీఆర్​
  • రుణమాఫీ అమలుకు మేం నానా తంటాలు పడ్డం
  • లెక్కా పత్రం లేకుండా కాంగ్రెసోళ్లు హామీలిచ్చి 
  • ఇప్పుడు అప్పులంటూ మాపై తప్పు మోపుతున్నరు
  • అధికారంలోకి వచ్చినంకనే అప్పుల గురించి తెలుస్తున్నదా?
  • హామీలు అమలు చేయలేకే శ్వేతపత్రాలు అంటున్నరని విమర్శ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమలుకు సాధ్యం కాని హామీలిచ్చిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వమే అప్పులన్నీ చేసిందంటూ తప్పును తమపై మోపే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ దుయ్యబట్టారు. ‘‘అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ​పాలకులకు అసలు ఆట ఇప్పుడే మొదలైంది. హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తం” అని అన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసేందుకే తాము నానా తంటాలు పడ్డామని, రీసోర్సెస్ ​మొబిలైజేషన్ ​కోసం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి తిప్పలు పడ్డామని చెప్పారు. లెక్కాపత్రం లేకుండా కాంగ్రెస్​ పార్టీ హామీలిచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేక అప్పులని చెప్తున్నారని విమర్శించారు. వాళ్లిచ్చిన హామీలతో అసలు ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతారు చూస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం బీఆర్ఎస్​ఎల్పీలో మీడియాతో కేటీఆర్​ చిట్​చాట్​చేశారు. ‘‘కాంగ్రెస్​ను గెలిపిస్తే 24 గంటల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని రాహుల్​గాంధీ చెప్పిండు.. ఏడపోయిండు..?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్​ వాళ్లకు రాష్ట్ర అప్పుల గురించి తెలుస్తున్నయా.. ఏటా పీఏసీ, కాగ్ రిపోర్టులు అసెంబ్లీలో పెడుతున్నాం.. విద్యుత్​ సంస్థల అప్పులు రూ.80 వేల కోట్లా అంటున్నరు.. జెన్కో, డిస్కంల వార్షిక నివేదికలు ఏటా అసెంబ్లీలో టేబుల్​ చేస్తున్నం.. వాటిలో అప్పులెన్ని తెచ్చామనే వివరాలన్నీ ఉన్నయ్​” అని అన్నారు.  అప్పులపై గతంలో అసెంబ్లీలో భట్టి విక్రమార్క ఎన్నోసార్లు ప్రశ్నలడిగితే తాము పాలకపక్షంగా సమాధానాలు కూడా చెప్పామని కేటీఆర్​ తెలిపారు.   
అన్ని వీడియోలు ఉన్నయ్​.. 

టైమ్​ వచ్చినప్పుడు బయటపెడ్తం

కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేకనే శ్వేత పత్రాలు అంటూ మాట్లాడుతున్నారని కేటీఆర్​ విమర్శించారు. ‘‘అసెంబ్లీలో గవర్నర్ ​ప్రసంగంలోనూ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని  చెప్పిస్తరు. మొదటి కేబినెట్​లో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తమన్నరు. మరి ఏమైంది?  దళితబంధు రూ.12 లక్షలు ఇస్తమన్నరు.. గిరిజనులకు కూడా అంతే మొత్తం ఇస్తమని చెప్పిన్రు. వాటి గురించి ఎందుకు మాట్లాడ్తలే” అని ప్రశ్నించారు. ‘‘ఒకాయన ఆయన నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు ఇస్తమని అన్నరు.. ఎలా చేస్తరో చూద్దాం.. పాలకుర్తిలో పోటీ చేసిన ఆమె జాబ్​మేళా పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇస్తమన్నరు..  ఎందరికి ఉద్యోగాలు ఇస్తరో చూస్తం..” అని కామెంట్స్​ చేశారు. వాళ్లు మాట్లాడిన అన్ని వీడియోలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడుతామని కేటీఆర్​ అన్నారు.