ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి : శ్రీనివాస్‌గౌడ్

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి : శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగుల సమస్యలను చాలా వరకూ పరిష్కరించామని, మిగిలిన కొన్ని సమస్యలను తీర్చాలని ఆయన సూచించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచామన్నారు. 

ఉద్యోగుల సమస్యల్లో చాలా వరకూ పరిష్కరించామని, ఇంకా కొన్ని మిగిలిపోయాయన్నారు. ఉద్యోగులకు కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చిందని, 4 నెలలు అవుతున్నా వాటిని అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగులు, జర్నలిస్ట్‌ల హెల్త్ స్కీమ్‌ను బలోపేతం చేసి, ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేయాలన్నారు. ఉద్యోగుల మెడికల్ బిల్స్, జీపీఎఫ్ బిల్స్‌ను, పెండింగ్ టీఏలు, డీఏలను తక్షణమే విడుదల చేయాలన్నారు. 

పోలీసులకు సరెండర్ లీవ్స్‌, టీఏలు, ఇతరత్ర బిల్లులు దాదాపు 13 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులైన భార్య, భర్తలకు ఒకే చోట పోస్టింగ్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.