- ఎన్డీయే 200 సీట్లు గెలుస్తుందని నవంబర్ 11న కామెంట్
కోల్కతా: బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా సెటైరికల్ గా పెట్టిన ఓ పోస్ట్ నిజమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 130 నుంచి 180 సీట్లు వస్తాయంటూ వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. రెండో దశ పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడ్డ ఈ అంచనాలపై యశ్వంత్ సిన్హా వ్యంగ్యంగా స్పందించారు.
నవంబర్ 11 న ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తప్పని, తన సర్వేలో ఎన్డీయే కూటమికి 200 సీట్లు వస్తాయని తేలిందంటూ సెటైరికల్ గా పోస్ట్ పెట్టారు. ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతాయని అందులో పేర్కొన్నారు. తన అంచనాలు తప్పైతే మాత్రం తనకు ఎలాంటి బాధ్యత లేదన్నారు.
ఆయన వ్యంగ్యంగానే ఈ పోస్టు పెట్టినప్పటికీ ఫలితాల్లో ఎన్డీయే కూటమికి 202 సీట్లు రావడంతో సిన్హా పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. కాగా, అసెంబ్లీ ఫలితాల తర్వాత యశ్వంత్ సిన్హా మరోమారు ఎక్స్ లో పోస్ట్ పెడుతూ.. ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవిలో జ్ఞానేశ్ కుమార్ ఉన్నంతవరకు, ఎన్నికల సంఘం రాజీపడుతున్నంత వరకూ.. ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీచేయకుండా ఉండడమే మేలని కామెంట్ చేశారు.
