మళ్లీ హస్తం గూటికి.. నల్లాల ఓదెలు దంపతులు

మళ్లీ హస్తం గూటికి.. నల్లాల ఓదెలు దంపతులు
  • నల్లాల ఓదెలు దంపతులు..మళ్లీ కాంగ్రెస్​లోకి
  •  16 నెలల కింద బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లోకి..
  •  ఆ తర్వాత ఐదు నెలలకు తిరిగి బీఆర్​ఎస్​లోకి.. 

    

కోల్​బెల్ట్​/హైదరాబాద్​, వెలుగు :  చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జెడ్పీ చైర్​పర్సన్​ భాగ్యలక్ష్మి మళ్లీ కాంగ్రెస్​ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్​లో పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వారితో పాటు కౌన్సిలర్​ శివకిరణ్​, నల్లాల శ్రావణ్​, నల్లాల సందీప్​, ఆయన అనుచరులు కాంగ్రెస్​లోకి వచ్చారు. వీరితో పాటు ఓదెలు దంపతుల కుమారులు నల్లాల శ్రవణ్ కుమార్, నల్లాల సాందీప్, బీఆర్ఎస్​ లీడర్లు దుర్గం నరేష్, ముజాహిద్, బింగి శివ, ఇందాస్,  ఇర్ఫాన్​ తదితరులు కూడా కాంగ్రెస్​లో చేరారు. బీఆర్​ఎస్​లో అవమానాలు, ఎమ్మెల్యే బాల్కసుమన్​ ఒత్తిళ్లు భరించలేక 16 నెలల కిందట ఆ పార్టీకి గుడ్​ బై చెప్పి కాంగ్రెస్​లో చేరిన నల్లాల ఓదెలు దంపతులు.. ఆ తర్వాత మళ్లీ ఐదునెలలకు బీఆర్​ఎస్​లో చేరారు. ఇప్పుడు తిరిగి హస్తం గూటికి చేరారు. 

నాలుగేండ్లుగా బీఆర్​ఎస్​లో ఇబ్బందులు 

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక దఫా విప్​గా బాధ్యతలు చేపట్టిన నేత నల్లాల ఓదెలు. ఆయన బీఆర్​ఎస్​ను వీడటం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారింది. తెలంగాణ ఉద్యమం సమయంలో మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్ (నాటి టీఆర్​ఎస్​)ను బలమైన శక్తిగా మార్చడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారనే పేరుంది. నల్లాల ఓదెలు 2009 సాధారణ ఎన్నికల్లో, ఆ తర్వాత 2010 ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్​ఎస్​లో సీనియర్​ లీడర్ గా ఉన్న నల్లాల ఓదెలును కాదని, 2018 ఎన్నికల్లో బాల్క సుమన్​కు కేసీఆర్​ టికెట్​ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన సుమన్​కు చెన్నూరు ఎమ్మెల్యే టికెట్​ ఎలా ఇస్తారని అప్పట్లో నల్లాల ఓదెలు ధిక్కార స్వరం వినిపించారు. రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుని బుజ్జగించడంతో ఓదెలు సైటెంట్​ అయ్యారు. తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో కోటపల్లి నుంచి ఆయన భార్య నల్లాల భాగ్యలక్ష్మీ జెడ్పీటీసీ గా గెలవడంతో మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్​ పదవి దక్కింది. అయితే.. సీనియర్​ లీడర్​నైన తనకు పార్టీలో సముచితస్థానం లేదని, పార్టీ కార్యక్రమాల్లో పక్కన పెట్టడంతో పాటు జడ్పీ చైర్​పర్సన్​ అయిన తన భార్య భాగ్యలక్ష్మీకి కూడా ప్రొటోకాల్ విషయంలో ఎమ్మెల్యే బాల్క సుమన్​ అవమాన పరుస్తున్నారని నల్లాల ఓదెలు తన సన్నిహితుల వద్ద వాపోయేవారు. ఇదే క్రమంలో 2022  మే 19న ఢిల్లీలో ప్రియాంకగాంధీ సమక్షంలో ఓదెలు దంపతులు కాంగ్రెస్ లో చేరారు.  

ALSO READ: ఫస్ట్​ క్లాస్​ నుంచి టెన్త్ దాకా.. సర్కార్ బడుల్లో బ్రేక్ ఫాస్ట్

తమను బీఆర్​ఎస్​లోనుంచి బయటికి పంపించేందుకు సుమన్​ ప్రయత్నాలు చేస్తున్నారని అప్పట్లో నల్లాల ఓదెలు మండిపడ్డారు. అయితే, భవిష్యత్తులో తనకు ఇబ్బందులు తప్పవని భావించిన  బాల్క సుమన్.. ఓదెలు దంపతులను బుజ్జగించి కేటీఆర్ సమక్షంలో అదే ఏడాది అక్టోబర్​ 5న మళ్లీ బీఆర్​ఎస్​లో చేర్పించారు. కాగా, ఐదునెలలకే కాంగ్రెస్​ను వీడి తిరిగి గులాబీ గూటికి చేరుకున్న నల్లాల ఓదెలు దంపతులపై ఎమ్మెల్యే బాల్క సుమన్ పాత ధోరణినే అవలంబిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్​ పదవి ఇస్తామన్న బీఆర్​ఎస్​ అధిష్ఠానం హామీతోనే ఓదెలు మళ్లీ బీఆర్​ఎస్​లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఎలాంటి పదవీ దక్కకపోగా.. ఈసారి కూడా బాల్క సుమన్​కే చెన్నూరు టికెట్​ను కేసీఆర్​ కేటాయించడంతో ఓదెలు అసంతృప్తికి గురయ్యారు. ఇదే క్రమంలో శుక్రవారం బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్పి కాంగ్రెస్​లో చేరారు.