ఆర్టీసీ తర్వాత సింగరేణిపైనే కేసీఆర్ కన్ను: వివేక్

ఆర్టీసీ తర్వాత సింగరేణిపైనే కేసీఆర్ కన్ను:  వివేక్
  • పైసలతో కేసీఆర్​ కుట్రలు
  • మున్సిపోల్స్​లో బీజేపీ జెండా ఎగరాలి
  • చెన్నూరు, క్యాతన్​పల్లి మున్సిపాలిటీల్లో సమావేశాలు

రామకృష్ణాపూర్​/మంచిర్యాల, వెలుగు: మున్సిపల్​ ఎన్నికల్లో డబ్బులు పంచి ఓటర్లను కొంటామని  టీఆర్ఎస్ ధీమాతో  ఉందని  మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు.   ప్రజల డబ్బులే సీఎం కేసీఆర్​  పంచిపెడుతాడని ఓటర్లకు చెప్పాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు.  ఉద్యమ సమయంలో టీఆర్ఎస్​ పార్టీకి డబ్బులు లేవని, అధికారంలోకి రాగానే ఇరిగేషన్​ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల కమీషన్ల పేరుతో  కోట్లు దండుకున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.60వేల కోట్లున్న అప్పు  ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్​దేనని ఎద్దేవా చేశారు.  ప్రతి ఒక్కరిపై  రూ.లక్ష చొప్పున అప్పు కట్టేలా రాష్ట్రాన్ని  దివాళా తీయించాడని అన్నారు.  టీఆర్ఎస్​కు బుద్ధి చెప్పేలా.. రానున్న మున్సిపల్​ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేయాలని పెద్దపల్లి  మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని క్యాతన్​పల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో నిర్వహించిన మున్సిపల్​ ఎన్నికల సన్నాహాక సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీని గెలిపిస్తే మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు వస్తాయని చెప్పారు.

సింగరేణిపై కన్నేసిన సీఎం

ఆర్టీసీ సమ్మెను నిరంకుశంగా అణిచివేసిన  కేసీఆర్​ కన్ను ఇప్పుడు సింగరేణిపై పడిందని వివేక్​ ఆరోపించారు.   సింగరేణి ఆస్తులను దోచుకోవడం లక్ష్యంగా కార్మిక సంఘాలు లేకుండా చేసే కుట్రలు చేస్తున్నాడని అన్నారు.   కారుణ్య నియామకాలను సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.   రాష్ట్రంలో నిరంకుశపాలన సాగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్​ నిజాంను తలపిస్తున్నారని, ఆర్టీసీ సమ్మెను అణిచివేసి 35 మంది  కార్మికుల చావుకు కారణమయ్యారని వివేక్​ ఆరోపించారు.  ఆర్టీసి సమ్మె సమయంలో  రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు  అఫిడవిట్లను సమర్పించి  హైకోర్టును తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు.  బీజేపీ ఈ విషయాన్ని విడిచిపెట్టబోదని, కోర్టులో పిటిషన్​ వేసి  న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి డబ్బులు దోచుకోవాలనుకున్న కేసీఆర్​ను  బీజేపీ అడ్డుకుందని తెలిపారు.   సింగరేణి సంస్థ అభివృద్ధికి తమ కుటుంబం ఎంతో కృషి చేసిందని, దివంగత వెంకటస్వామి (కాకా) చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కాళేశ్వరం నీళ్లు కేసీఆర్​ ఫామ్​ హౌజ్​కు

కాళేశ్వరం నీళ్లను  కేసీఆర్​ వంద ఎకరాల ఫాంహౌజ్​కు తరలించేందుకు కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. సీఎం కావడానికి ముందు రెండు ఎకరాల ఫాంహౌజ్​ ఇప్పుడు వంద ఎకరాలకు చేరిందని అన్నారు.   కేంద్రం రెండు లక్షల ఇళ్లు మంజూరు చేస్తే కనీసం పదివేల ఇళ్లు కూడా కట్టించలేని సీఎం …తన కొడుకు కోసం రూ.100 కోట్లతో ప్రగతిభవన్​ కట్టించాడన్నారు.  అందరికి ఉద్యోగాలు, డబుల్​ బెడ్​రూం ఇండ్లు,  నిరుద్యోగ భృతి,  రిటైర్మెంట్​ ఏజ్​ పెంచుతానని, పెన్షన్​ ఏజ్​ తక్కువ చేస్తానని మభ్యపెట్టి ఎన్నికల్లో  ఓట్లు వేయించుకున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో  బీజేపీ జిల్లా అధ్యక్షుడు ముల్కల మల్లారెడ్డి,  చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల ఇన్చార్జులు అందుగుల శ్రీనివాస్​, రఘునాథ్ వెరబెల్లి​, జిల్లా జనరల్​ సెక్రటరీ నగూనూరి వెంకటేశ్వర్​గౌడ్​, క్యాతన్​పల్లి, చెన్నూర్​ మున్సిపాలిటీల అధ్యక్షులు మహాంకాళీ శ్రీనివాస్​, సుశీల్​కుమార్,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరుముల్ల పోశం, నాయకులు దీక్షితులు, గుత్తుల ప్రసాద్​ పాల్గొన్నారు.

Former MLA Vivek Venkataswamy has called for the BJP to fly the flag in the upcoming municipal elections