
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ అన్నారు. వారి హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించి, రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు నీతులు మాట్లాడడం సిగ్గుచేటని ఆయన ఫైర్అయ్యారు.
మంగళవారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో మధు యాష్కీ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై కేటీఆర్, హరీశ్ రావు విమర్శలపై ఆయన మండిపడ్డారు. అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో ప్రతిపక్ష పార్టీలను చీల్చి, రాజకీయాల్లో విలువలను దిగజార్చిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు కేటీఆర్ కు ఫిరాయింపులు గుర్తుకు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు.