కేటీఆర్, హరీశ్ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నరు: మంత్రి వివేక్ వెంకటస్వామి

కేటీఆర్, హరీశ్ రౌడీయిజాన్ని  ప్రోత్సహిస్తున్నరు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • బాల్క సుమన్‌ను జైలుకెళ్లి పరామర్శించడంతో 
  • ఈ విషయం అర్థమైంది: మంత్రి వివేక్‌ వెంకటస్వామి
  • క్యాతనపల్లిలో ఎక్స్ అఫీషియో ఓటును వేసేందుకు వెళ్తున్న మాపై దాడి చేసిండని ఫైర్​
  • పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల పైనా రాళ్లు రువ్వారని వెల్లడి
  • చెన్నూరు మున్సిపాలిటీ  చైర్‌‌ పర్సన్‌, వైస్ చైర్‌‌పర్సన్‌ బాధ్యతల స్వీకార 
  • కార్యక్రమానికి హాజరు

కోల్​బెల్ట్, వెలుగు: తమపైనా, పోలీసులపైనా దాడికి పాల్పడిన బీఆర్‌‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను జైలుకెళ్లి పరామర్శిచడం ద్వారా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారన్న విషయం అర్థమవుతోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడానికి తాను, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి వెళ్తుంటే బీఆర్‌‌ఎస్ లీడర్లు అడ్డుకొని దాడులు చేశారని, ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌కు, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయని చెప్పారు. స్వయంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తమ కార్లపై రాళ్లు, ట్రాఫిక్ కోన్లు విసిరాడని గుర్తుచేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా పెద్దింటి పద్మ శ్రీనివాస్, వైస్ చైర్‌‌పర్సన్‌గా నాయకపు వినయ్ పదవీబాధ్యతల స్వీకార కార్యక్రమానికి వివేక్‌ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై, నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్‌‌తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. క్యాతనపల్లి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికను తాను అడ్డుకుంటున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్ చేసిన అరాచకాలను చెన్నూరు ప్రజలు మరిచిపోరని, అందుకే మొన్నటి ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పారన్నారు. మొదటి రోజు బీఆర్‌‌ఎస్, సీపీఐ కౌన్సిలర్లు ఆలస్యంగా రావడం వల్ల క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా పడిందని, మర్నాడు ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు వెళ్తున్న తమపై ఓడిన ఫ్రస్టేషన్‌లో ఉన్న సుమన్, బీఆర్‌‌ఎస్ లీడర్లు దాడి చేశారన్నారు. ఈ దాడిలో తన వాహనం అద్దాలు పగిలిపోవడంతో పాటు కానిస్టేబుల్‌కు గాయాలు కావడంతో బాల్క సుమన్‌ను అరెస్టు చేశారని, ఇందులో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

దాడుల సంస్కృతి బీఆర్‌‌ఎస్‌దే..

ప్రజలను బెదిరించడం, దాడులు చేయడం బీఆర్‌‌ఎస్ సంస్కృతేనని వివేక్ అన్నారు. 2023లో నామినేషన్ వేసేందుకు 300 మీటర్ల దూరంలో వెహికల్స్ ఆపి, నడుచుకుంటూ వెళ్లిన తనపై అధికారం ఉందన్న అహంతో బాల్క సుమన్ చూపించిన జులుంను చెన్నూరు ప్రజలు మర్చిపోరన్నారు. తమ పార్టీని వ్యతిరేకించే వాళ్లను బట్టలిప్పించి కొడతానంటూ సుమన్ తన గూండాయిజాన్ని ప్రదర్శించాడని గుర్తుచేశారు. ఇంకా గూండాయిజం చేస్తానంటే ఎవరు ఊరుకుంటారని ప్రశ్నించారు. సుమన్ చట్టవ్యతిరేక పనులు చేయడం హాబీగా పెట్టుకున్నాడని ఆరోపించారు. గతంలో భూకబ్జా, దందాలు చేసిన వాళ్లపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్‌ను బలోపేతం చేశానని, మున్సిపల్ ఎన్నికల్లో 6 మున్సిపాలిటీలను గెలుచుకున్నామన్నారు.