లిక్కర్ కేసు వల్లే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఓటమి: కేటీఆర్

లిక్కర్ కేసు వల్లే  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఓటమి: కేటీఆర్
  • అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల్లో నష్టపోయినం: కేటీఆర్​
  •     కవితకు కోర్టులో న్యాయం జరిగింది
  •     మాపై పెడుతున్న కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమే.. త్వరలోనే తేలుతుందని కామెంట్‌‌‌‌‌‌‌‌


హైదరాబాద్, వెలుగు: లిక్కర్​ స్కామ్​ కేసు సాకుతో ఢిల్లీలో కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఆప్​ ప్రభుత్వాన్ని కూల్చారని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆరోపించారు. ఆ కేసు వల్లే అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ రాజకీయంగా నష్టపోయిందని పేర్కొన్నారు. లిక్కర్​ స్కామ్​ కేసులో రౌస్​ అవెన్యూ కోర్టు తీర్పుపై శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్​ స్పందించారు. కవితకు కోర్టులో న్యాయం జరిగిందని చెప్పారు. లిక్కర్​ కేసులాగానే తమ నాయకులపై నమోదైన కేసులన్నీ అబద్ధమని, రాజకీయ ప్రేరేపితం, కల్పితమని త్వరలోనే తేలిపోతుందని అన్నారు. సత్యం గెలిచేదాకా కాంగ్రెస్​, బీజేపీ చేసే బాధ్యతారహితమైన ఆరోపణలను చూశామన్నారు.‘‘అసత్యపూరిత, కుట్రపూరిత కేసులను, ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించి మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని విమర్శించారు. దురదృష్టవశాత్తూ  సాక్ష్యాలకంటే ఆరోపణలకే ప్రాధాన్యతనిస్తున్నారని, న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ ‘నవ భారతం’లో అలవాటుగా మారిపోయిందని పేర్కొన్నారు. కానీ, చివరికి, న్యాయమే గెలుస్తుందని అన్నారు. 

అవినీతి–అరాచకమే కాంగ్రెస్ పాలన జోడెడ్లు 

రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తున్నదని కేటీఆర్​ ఆరోపించారు. కేసీఆర్​ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెడ్లుగా ముందుకు సాగితే.. కాంగ్రెస్​ మాత్రం అవినీతి, అరాచకమే జోడెడ్లుగా పాలన చేస్తున్నదని విమర్శించారు.  చెక్ డ్యామ్‌‌‌‌లు పేల్చడం, పల్లె ప్రకృతి వనాల్లో చెట్లను నరకడంలాంటి చర్యలు రాష్ట్రాన్ని వెనక్కు నెడుతున్నాయని అన్నారు. అలంపూర్​ నియోజకవర్గంలో విజయం సాధించిన మున్సిపల్​ కౌన్సిలర్లను శుక్రవారం తెలంగాణభవన్‌‌‌‌లో కేటీఆర్​ సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు.  నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌లో రెండు నెలల పాప మరణ ఘటన, కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్‌‌‌‌ లాకప్ డెత్‌‌‌‌లాంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఖమ్మం వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేతలతో ప్రభుత్వం ప్రజలను రోడ్డున పడేసి దారుణంగా వ్యవహరించిందన్నారు. 

ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, రైతుబంధు, ఎరువుల సరఫరాలాంటి అంశాల్లో రైతులను తీవ్రంగా నిరాశపరిచిందని  పేర్కొన్నారు. ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ నిజ స్వరూపం అర్థమైందని అన్నారు. అలంపూర్, ఐజ, గద్వాల, వడ్డేపల్లి ప్రాంతాల్లో బీఆర్ఎస్​కు ప్రజలు అందించిన మద్దతు విశేషమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఉన్నప్పటికీ నడిగడ్డలో మాత్రం ప్రజల విశ్వాసం ఇప్పటికీ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పైనే ఉందని పేర్కొన్నారు. సర్పంచ్​ ఎన్నికల నుంచి మున్సిపల్​ ఎన్నికల వరకు మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం పార్టీ బలాన్ని నిరూపిస్తున్నదని చెప్పారు. నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం వ్యాపించాలని, ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామిరెడ్డి ప్రజల సమస్యలపై అంకితభావంతో పనిచేసే నాయకుడని, ఎమ్మెల్యే విజయుడు కూడా అదే తత్వాన్ని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ  ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.