
కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని..స్వార్థం కోసమే పార్టీ పేరును మార్చారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. మూడో సారి ముఖ్యమంత్రి కోసం ఏం ముఖం పెట్టి ఓట్లు అడుగుతున్నారని చురకలంటించారు. ఎన్నో ఆకాంక్షలతో..కులమతాల ఐక్య ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. కానీ తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేరడం లేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని తెలిపారు.
హామీలు మరిచారు..
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచారని పొంగులేటి మండిపడ్డారు. మైనారిటీలకు 12% రిజర్వేషన్లు, ఇంటికొక ఉద్యోగం, దళితులకు మూడెకరాలా భూమి,నిరుద్యోగ భృతి, దళిత ముఖ్యమంత్రి వంటి అనేక వాగ్దానాలను మరిచారని విమర్శించారు. ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన యువత ఆశయాలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత లిక్కర్ కేసు వాదించేందుకు న్యాయవాదులకు ఫీజులు చెల్లించడానికి డబ్బులున్నాయి కానీ..మైనారిటీ రిజర్వేషన్ కోసం వాదించే న్యాయవాదికి చెల్లించడానికి డబ్బు లేదా అని ప్రశ్నించారు. అనేక మంది తల్లితండ్రులు కష్టపడి తమ పిల్లలను చదివిస్తే.., మంత్రుల పీఏల ద్వారా పేపర్లు లీకులు చేయించి.., సిట్ అనే ఇంటి సంస్థ ద్వారా కేసును దర్యాప్తు చేయిస్తున్నారని మండిపడ్డారు.
కార్మికులు చనిపోతే పరామర్శించే తీరక లేదా..
సింగరేణి కార్మికులు బార్డర్లో ఉంటే సైనికులతో సమానం అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సింగరేణి గనుల్లో 123 మంది కార్మికులు చనిపోతే వారి కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కార్మికులు చనిపోతే వైఎస్ , చంద్రబాబు లు వెళ్లి పరామర్శించారని గుర్తు చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రికి వారిని పరామర్శించే తీరక లేదని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా రిక్రూట్మెంట్లో 35 నుంచి 40 సంవత్సరాల వయో పరిమితి పెంచుతామనే మాటను విస్మరించారన్నారు. 2014 లో సింగరేణి బాండ్ల ద్వారా 3 వేల 225 కోట్ల అప్పుంటే..ఇవాళ 8 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని అప్పుల్లో కూర్చారని...రాష్ట్ర ప్రభుత్వమే ఆ డబ్బును కొల్లగొట్టిందన్నారు. కేటిపిఎస్ లో ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పొంగులేటి ఆరోపించారు.
రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసుకోవాలని పొంగులేటి సూచించారు. ముఖ్యమంత్రి వ్యతిరేక వర్గం ఒక్కటయ్యేందుకు కొత్తగూడం సమ్మేళనంలో బీజం పడిందన్నారు. కొత్తగూడం నియోజక వర్గంలో తన సభకు వచ్చే వారిని ప్రభుత్వం అడ్డుకున్నదని మండిపడ్డారు. కొత్తగూడెం నియోజకవర్గానికి తాను పెద్ద కొడుకు లాగా ఉంటానని...చందాలు , దందాలు చేసే వారు ఉమ్మడి జిల్లాలో ఉండబోరన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, ఆమె తండ్రి , భర్త భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అన్యాయం చేస్తే నిరహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. అధికారం ఎవరబ్బ సొత్తు కాదు... అధికారులు తొత్తులుగా మారితే ఎవ్వరిని వదలమన్నారు.