సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : స్థానికేతరులను గెలిపిస్తే నియోజవకర్గాల్లో సమస్యలు పరిష్కారం కావని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిరిసిల్లలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ ఎంపీగా పని చేసిన వినోద్ కుమార్ స్థానికుడు కాదని, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు జర్మనీ బాబని, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్థానికేతరుడేనని అన్నారు. వచ్చే ఎనికల్లో స్థానికులనే గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. మీ కరీంనగర్ బిడ్డగా నన్ను ఎంపీగా గెలిపించినందుకు ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించానని తెలిపారు. చేనేత కార్మికుల జనాభా సిరిసిల్లలో ఎక్కువగా ఉంటే తన తర్వాత కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన వినోద్ కుమార్ తన వరంగల్ కు చేసేత క్లస్టర్ ను మంజూరు చేయించుకున్నారన్నారు.
నేషనల్ హైవే రూటుపై మార్పులెందుకు?
తాను ఎంపీగా ఉన్న సమయంలో మంజూరు చేయించిన నేషనల్ హైవే 563ను వినోద్కుమార్పూర్తిగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన ప్రతిమ కాలేజీ నుంచి వచ్చే విధంగా మార్పులు చేస్తున్నారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పడంలేదన్నారు. సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్ నాగుల సత్యనారాయణ గౌడ్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సిరిసిల్ల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
