
హైదరాబాద్, వెలుగు: బంగారు పల్లెంలో రాష్ట్రాన్ని అప్పగించామని, ఆర్థిక వనరుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక చెప్తోందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎంతో శ్రమించి సృష్టించిన రాష్ట్ర ఆర్థిక వనరులను కాంగ్రెస్ప్రభుత్వం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రానికి మంచి పాలన అందించాలని కోరారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, పంజాబ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల కన్నా ఆర్థిక వనరుల్లో తెలంగాణ ముందు ఉన్నదని చెప్పారు.
తెలంగాణ అప్పుల పాలు అయ్యిందని సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్నాయకులు పదే పదే చెప్పడం సరికాదన్నారు. స్టేట్ఓన్రెవెన్యూను సమకూర్చుకోవడంలో 84.2 శాతంతో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. పదేళ్లలో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు 400 శాతం పెరిగాయని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగిందని వెల్లడించారు. పుష్కలంగా కరెంట్, నీటి సౌకర్యం కల్పించడంతోనే వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని వివరించారు. ఐటీ, పరిశ్రమలరంగాల్లోనూ ఎంతో పురోగతి సాధించామని స్పష్టం చేశారు.