మన పీవీకి భారతరత్న.. ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డు

మన పీవీకి భారతరత్న.. ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డు
  • మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ 
  • పితామహుడు ఎంఎస్ స్వామినాథన్​కు కూడా..
  • ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి పీవీ నరసింహారావు పునాది
  • భూసంస్కరణలతో పాటు విద్యారంగంలోనూ మార్పులు 
  • ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగానూ సేవలు 
  • దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా, ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డు

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్​తో పాటు భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్​కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఇటీవల బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, బీజేపీ కురువృద్ధుడు ఎల్​కే అద్వానీకి ఈ అవార్డు ప్రకటించిన కేంద్రం.. ఇప్పుడు మరో ముగ్గురికి అనౌన్స్ చేసింది. మొత్తంగా ఈ ఏడాది ఐదుగురిని భారతరత్న వరించింది. వీరిలో ఒక్క ఎల్​కే అద్వానీ తప్ప.. మిగిలిన నలుగురికి మరణానంతరం అవార్డు దక్కింది. కాగా,  ఒకే ఏడాదిలో ఐదుగురికి భారతరత్న ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 1999లో నలుగురికి అవార్డు ప్రకటించారు.

దక్షిణాది నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి వ్యక్తి పీవీ నరసింహారావు. అపర చాణక్యుడిగా పేరొందిన ఆయన.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాభివృద్ధికి బాటలు వేశారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ రైతు నాయకుడిగా పేరొందారు. రైతుల సమస్యలపై పోరాటం చేశారు. ఉత్తరప్రదేశ్ లో వ్యవసాయం రూపురేఖలను మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రధానిగా పని చేసిన అతికొద్ది కాలంలోనే రైతులకు అనుకూలమైన చట్టాలను తీసుకొచ్చారు. ఎంఎస్ స్వామినాథన్ మన దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. హరిత విప్లవానికి నాంది పలికి.. దేశంలో ఆకలి కేకలు తీర్చారు. ఒకప్పుడు విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి విదేశాలకే ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లారు. దేశానికి అన్నం పెట్టి హరిత విప్లవ పితామహుడిగా గుర్తింపు పొందారు. 

వాళ్ల సేవలు మరువలేమన్న మోదీ..  

పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న అందజేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో ప్రకటించారు. ఈ సందర్భంగా వాళ్లు ముగ్గురూ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ‘‘పీవీ రాజనీతిజ్ఞుడు. ఆయన దేశానికి అందించిన సేవలు అపారం. పీవీ నాయకత్వం దేశాభివృద్ధికి పునాది వేసింది. ఆయన హయాంలో దేశ ఆర్థిక వృద్ధిలో కొత్త శకం మొదలైంది. విదేశాంగ విధానం, విద్యారంగంలోనూ ఆయన అందించిన సేవలు.. దేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సుసంపన్నం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంట్, అసెంబ్లీ సభ్యుడిగానూ పీవీ సేవలు మరువలేనివి” అని మోదీ కొనియాడారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ కు భారతరత్న ప్రకటించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఇది దేశానికి ఆయన చేసిన సేవలకు అంకితమని పేర్కొన్నారు. 

‘‘ఎమ్మెల్యేగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా చరణ్ సింగ్ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. రైతుల పక్షాన నిలిచి, వాళ్ల కోసం పోరాడారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కొట్లాడారు” అని ప్రశంసించారు. దేశ వ్యవసాయ రంగం, రైతులకు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న ఇస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ‘‘వ్యవసాయ రంగంలో మన దేశం స్వావలంబన సాధించడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు. కొత్త విధానాలను అందుబాటులోకి తెచ్చారు. మేం ఆయన అమూల్యమైన సేవలను గుర్తించాం. అలాగే వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహిస్తున్నాం. స్వామినాథన్ విజన్ మన వ్యవసాయ రంగాన్ని మార్చడమే కాకుండా దేశానికి ఆహార భద్రత కల్పించింది” అని కొనియాడారు. స్వామినాథన్ తో తనకు దగ్గరి పరిచయం ఉండేదని, ఆయన సలహాలు సూచనలకు ఎల్లప్పుడూ విలువ ఇచ్చానని మోదీ పేర్కొన్నారు.

పుట్టింది లక్నేపల్లిలో.. పెరిగింది వంగరలో

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న రుక్మాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ నరసింహారావు జన్మించారు. అయితే పీవీని పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. దీంతో ఆయన పేరు పాములపర్తి వెంకట నరసింహారావుగా మారింది. పీవీ రాజనీతిజ్ఞుడు. ఆయన దేశానికి అందించిన సేవలు అపారం. పీవీ నాయకత్వం దేశాభివృద్ధికి పునాది వేసింది. ఆయన హయాంలో దేశ ఆర్థిక వృద్ధిలో కొత్త శకం మొదలైంది.చరణ్ సింగ్.. దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. రైతుల పక్షాన నిలిచి, వాళ్ల కోసం పోరాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొట్లాడారు. 


వ్యవసాయ రంగంలో మన దేశం స్వావలంబన సాధించడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు. కొత్త విధానాలను అందుబాటులోకి తెచ్చారు. స్వామినాథన్ విజన్ మన వ్యవసాయ రంగాన్ని మార్చడమే కాకుండా దేశానికి ఆహార భద్రత కల్పించింది.
‑ ప్రధాని నరేంద్ర మోదీ

గర్వకారణం

ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తికి భారతరత్న రావడం ఎంతో గర్వకారణం. ఇండియాను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నిలబెట్టిన ఘనత పీవీకే దక్కుతుంది. రాష్ట్ర ప్రజల తరఫున పీవీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు.
‑ సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం 

ముగ్గురికి భారత రత్న ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. పీవీ దేశ నిర్మాణానికి విశేషమైన సహకారం అందించారు. ఆయన ప్రభుత్వంలో భారత ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. దేశంలో అణు కార్యక్రమాలు, విదేశాంగ విధాన విజయాలు ఆయన పదవీ కాలానికి గుర్తుగా ఉన్నాయి. కోట్లాది మంది రైతుల కోసం పనిచేసిన వ్యక్తి చరణసింగ్. హరిత విప్లవం ద్వారా భారత ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించడంలో స్వామినాథన్​కృషి ఎనలేనిది.
‑ మల్లికార్జున ఖర్గే, 
కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు

స్వాగతిస్తున్నాను: సోనియా  

పీవీ నరసింహారావు సహా ముగ్గురు ప్రముఖులకు భారత రత్న అవార్డు ఇవ్వడంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ స్పందించారు. ప్రభుత్వ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఆమెను మీడియా ప్రతినిధులు స్పందన కోరగా.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ‘వారికి భారత రత్న ఇవ్వడాన్ని ఎందుకు స్వాగతించం.. కచ్చితంగా స్వాగతిస్తున్నాను’’ అని అన్నారు.