
- తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్
హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో అభివద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ ఈ నెల 18న ‘చలో హైదరాబాద్’ ఇందిరాపార్క్ వద్ద మాజీ సర్పంచులు చేపట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. మాజీ సర్పంచులు అప్పులు చేసి మరి అభివద్ధి పనులు చేపట్టారని, తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే సర్పంచుల ప్రాణాలకు విలువలేదా అని ప్రశ్నించారు. గ్రామాలు ఎదగాలంటే సర్పంచులకు న్యాయం జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కుంటి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, మల్లయ్య, గణేశ్ రవి, రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.