
- భారత పార్లమెంట్, ముంబై అటాక్స్ వెనుకున్నది అతడే
- జైషే టాప్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ అంగీకారం
ఇస్లామాబాద్: మన దేశ పార్లమెంట్‌పై జరిగిన అటాక్, 26/11 ముంబై దాడులకు జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజారే సూత్రధారి అని ఆ టెర్రరిస్టు సంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ అంగీకరించాడు. ఢిల్లీ, ముంబై టెర్రర్ అటాక్స్‌కు సంబంధించిన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అంతా మసూద్ అజార్ కనుసన్నల్లోనే జరిగిందని చెప్పాడు.
ఈ వీడియో తాజాగా బయటకొచ్చింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మన ఆర్మీ చేపట్టిన దాడుల్లో మసూద్ అజార్ కుటుంబసభ్యులు ముక్కలు ముక్కలుగా పేలిపోయారని ఇంతకుముందు అంగీకరించిన మసూద్ ఇల్యాస్ కశ్మీరీ.. ఇప్పుడు ఢిల్లీ, ముంబై దాడుల సూత్రధారి మసూద్ అజారేనని అంగీకరించాడు. ‘‘అమీర్ ఉల్ ముజాహిద్దీన్ మౌలానా మసూద్ అజార్ భారత్‌లోని తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత పాకిస్తాన్‌కు వచ్చారు. ఆయనకు బాలాకోట్‌లో ఆశ్రయం లభించింది.
అక్కడి నుంచే ఢిల్లీ, ముంబై దాడులకు ప్రణాళిక రచించి మిషన్ పూర్తి చేశారు” అని వీడియోలో మసూద్ ఇల్యాస్ కశ్మీరీ పేర్కొన్నాడు. ఇక ఒసామా బిన్ లాడెన్‌ను అమరవీరుడిగా కీర్తించాడు. కాగా, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మన దేశం జరిపిన దాడుల్లో మరణించిన టెర్రరిస్టుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ హాజరైన విషయాన్ని కూడా మసూద్ ఇల్యాస్ కశ్మీరీ అంగీకరించాడు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ ఆదేశాలతోనే వాళ్లు ఉగ్రవాదుల అంత్యక్రియలకు వచ్చారని చెప్పాడు.
పాక్ బండారం బట్టబయలు..
జైషే టాప్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ వ్యాఖ్యలతో పాక్ బండారం బట్టబయలైంది. తాము టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వట్లేదని పాక్ ఎప్పటి నుంచో బుకాయిస్తూ వస్తోంది. భారత్‌లో ఉగ్ర దాడులతో తమకేం సంబంధంలేదని చెబుతూ వస్తున్నది. కానీ అదంతా అబద్ధమని ఇల్యాస్ కశ్మీరీ వ్యాఖ్యలతో తేలిపోయింది.