
- కేసీఆర్ మమ్మల్ని నిర్లక్ష్యం చేసిండు.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకోవాలి
- బిల్లులు రిలీజ్ చేయకపోతే ఎంపీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తామని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని మాజీ సర్పంచ్ లు డిమాండ్ చేశారు. గత ఐదేండ్లు గ్రామాలను ఎంతో డెవలప్ చేశామని, కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ గ్రామ పంచాయతీలకు ఎన్నో అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. చలో హైదరాబాద్ పిలుపులో భాగంగా గురువారం పెద్ద సంఖ్యలో మాజీ సర్పంచ్‌లు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు.
నల్ల బ్యాడ్జీలు ధరించి అమరులకు నివాళులర్పించారు. ప్ల కార్డులు పట్టుకుని అక్కడే బైఠాయించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడారు. ‘‘అప్పులు తెచ్చి.. బంగారం కుదువ పెట్టి సర్పంచ్ లు పనులు చేశారు. దేశంలో తొలిసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక బిల్లులపై అధికారులు వివరాలు తీసుకున్నారు. దీంతో బిల్లులు రిలీజ్ అవుతాయని ఎంతో ఆశపడ్డాం. కానీ.. ప్రభుత్వం రిలీజ్ చేయలేదు.
బిల్లులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఇప్పటికే రెండు సార్లు సీఎంను, మంత్రి సీతక్కను కలిశాం’’అని చెప్పారు. ప్రజా వాణిలో కూడా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమ సమస్యలు ప్రస్తావించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.1,200 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు నేతలు తెలిపారు.
ఒక్కో సెగ్మెంట్ నుంచి వంద నామినేషన్లు వేస్తం
లోక్‌సభ ఎన్నికల్లోపు పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే.. ప్రతి నియోజకవర్గం నుంచి వంద మంది మాజీ సర్పంచ్‌లు నామినేషన్లు దాఖలు చేస్తామని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యాదయ్యగౌడ్, కొలను శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. బిల్లులు విడుదల చేశాకే ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు రావాలన్నారు. అలా చేయకపోతే లీడర్లను గ్రామ సరిహద్దుల్లోనే అడ్డుకుంటామన్నారు. తర్వాత అసెంబ్లీ ముందు మాజీ సర్పంచ్‌లు బైఠాయించి నిరసన తెలపడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.