
హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదయింది. హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు జి.వినోద్, హెచ్‌సీఏ మాజీ సెక్రెటరీ శేషు నారాయణ, ఏసీ మెంబర్ శ్రీధర్ బాబు కలిసి రాచకొండ సీపీకి కంప్లైంట్ అందజేశారు. సెప్టెంబర్ 26వరకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా అజారుద్దిన్ గడువు ముగిసింది. ఆయన గడువు ముగిసినా తప్పుడు డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి బీసీసీఐని, ఈసీ కమిటీని తప్పుదోవ పట్టించే విధంగా అజరుద్దీన్ వ్యవహరించారన్నారు. పదవీ కాలంపై ఎవరినీ సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తరువులు జారీచేశారని ఫిర్యాదులో పొందుపరిచారు. ఈనెల 18 న బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్ కు హాజరు అయ్యేందుకు అజారుద్దిన్ తన పదవి సమయాన్ని పొడిగించుకున్నట్లు కంప్లైంట్ లో ఆరోపించారు. దీనిపైనా పై క్రిమినల్ కేసు కింద ఐపీసీ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ కి మాజీ హెచ్‌సీఏ ప్రతినిధులు కంప్లైంట్ చేశారు.
మ్యాచ్ టికెట్ల విక్రయం, తొక్కిసలాటలో భాగంగా ఇప్పటికే హెచ్‌సీఏ పై పలుమార్లు కేసు నమోదైంది. ఇదిలా ఉండగా భారత్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో భాగంగా ఈ నెల 25న మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ టికెట్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆన్ లైన్ లో పెట్టిన కాసేపటికే టికెట్లు అమ్ముడుపోయానని చూపించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఆందోళనల తర్వాత ఆఫ్ లైన్ లో టికెట్లు ఇస్తామని హెచ్‌సీఏ ప్రకటించింది. దీంతో వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు జింఖానా మైదానానికి చేరుకుని టికెట్లు దక్కించుకోవడానికి ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తతంగా మారింది.