కౌన్సిల్‌‌కు కలెక్టర్!

కౌన్సిల్‌‌కు కలెక్టర్!
  • రెవెన్యూ శాఖ అప్పగించే చాన్స్​

హైదరాబాద్/సిద్దిపేట, వెలుగు: సీఎం కేసీఆర్‌‌కు చాలా దగ్గరివాడని పేరున్న సిద్దిపేట కలెక్టర్‌‌ పారుపాటి వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ కు రాజీనామా చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్‌‌ఎస్‌‌)కు దరఖాస్తు చేసుకోవడం, సెక్రటేరియట్‌లో చీఫ్ సెక్రెటరీని కలిసి లేఖ ఇవ్వడం, ఆమోదం తెలుపుతూ సీఎస్‌‌ ఉత్తర్వులు జారీ చేయడం సోమవారం ఒకదాని తర్వాత ఒకటి చకచకా జరిగిపోయాయి. వెంకట్రామిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై కొన్నేళ్లుగా జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన్ను ఎమ్మెల్సీ చేయడంతో పాటు కేబినెట్‌‌లోకి తీసుకొని రెవెన్యూ శాఖ అప్పగిస్తానని కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారని టీఆర్‌‌ఎస్‌‌ వర్గాలు చెప్తున్నాయి. రాజీనామాతో ఈ వార్తలు నిజమయ్యాయని అంటున్నారు. ఎమ్మెల్యే కోటాలోనే మండలికి పంపాలనుకున్నా ఇతర లెక్కల నేపథ్యంలో కరీంనగర్‌‌ లోకల్ బాడీస్ కోటాలో ఆయనను బరిలో దించుతారని తెలుస్తోంది. తర్వాత కేబినెట్‌‌ విస్తరణలో మంత్రిగా చాన్సిస్తారని, అడ్మినిస్ట్రేటర్‌‌గా అనుభవముంది గనుక రెవెన్యూ శాఖ అప్పగిస్తారని కూడా చెప్తున్నారు. వెంకట్రామిరెడ్డికి 2022 సెప్టెంబర్‌‌ దాకా సర్వీసుంది.

ఏ బాధ్యత ఇచ్చినా ఓకే: వెంకట్రామిరెడ్డి

కేసీఆర్‌‌ నుంచి పిలుపు రాగానే టీఆర్‌‌ఎస్‌‌లో చేరుతానని వెంకట్రామిరెడ్డి చెప్పారు. రాజీనామా తర్వాత సెక్రటేరియట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఆయన ఏ బాధ్యత ఇచ్చినా నెరవేర్చడానికి కృషి చేస్తానని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన వెంకట్రామిరెడ్డి 1996లో గ్రూపు1కు సెలెక్టయ్యారు. 2007లో కన్ఫర్డ్​ ఐఏఎస్ అయ్యారు. హుడా సెక్రెటరీగా, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌‌గా చేశారు.

2019లోనే ఎంపీ టికెటిస్తరని

2019 లోక్సభ ఎన్నికల్లోనే మల్కాజ్‌‌గిరి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి బరిలో దిగుతారని జోరుగా ప్రచారం జరిగింది. దుబ్బాక బై ఎలక్షనప్పుడూ ఆయన పేరు వినిపించింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచో, మెదక్‌‌ నుంచో పోటీకి దింపుతారని ప్రచారం జరుగుతోంది. ఇంతలో మండలి ఎన్నికల్లో చాన్సిస్తానని సీఎం హామీ ఇవ్వడంతో ఐఏఎస్ కు రాజీనామా చేశారంటున్నారు.

కేసీఆర్ కు పాదాభివందనాలు

కేసీఆర్ కు కాళ్లు మొక్కడం ద్వారా వెంకట్రామిరెడ్డి పలుమార్లు వార్తల్లో వ్యక్తి అయ్యారు. సిద్ధిపేట కలెక్టరేట్ ప్రారంభోత్సవమప్పుడు కలెక్టర్ ​హోదాలో కేసీఆర్ ​కాళ్లు మొక్కడంపై అప్పట్లో చర్చ జరిగింది. పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ కండువా కప్పుకొమ్మని అపోజిషన్ లీడర్లు విమర్శించారు. 2016లో సిద్దిపేట తొలి కలెక్టర్‌‌గా బాధ్యతలు తీసుకుంటూ ఆయన కేసీఆర్ కాళ్లు మొక్కారు. వరి వేస్తే కఠిన చర్యలు తప్పవని ఇటీవల ఆయన రైతులను హెచ్చరించడం విమర్శలకు దారితీసినప్పటి నుంచిఆయన సెలవులో ఉన్నారు. వరి విత్తనాలమ్మితే డీలర్లపై కేసులు పెడతానని, ఉద్యోగులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించడమే గాక హైకోర్టు ఆదేశాలను, ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్లనూ పట్టించుకోనని కామెంట్లు చేశారు.

కేసీఆర్, హరీశ్ లను చూసి ఇన్ స్పైరైన

కేసీఆర్ ను పొలిటీషియన్ గా చూడొద్దని, ఆయన తెలంగాణ కు గాడ్‌‌ ఫాదర్ అని వెంకట్రామిరెడ్డి ‘వీ6వెలుగు’తో అన్నారు. ‘‘కేసీఆర్, మంత్రి హరీశ్ పనితీరుతో ఇన్ స్పైర్ అయిన. టీఆర్ఎస్ లో కార్యకర్తగా చేరితే వారికి ఇంకా దగ్గరగా ఉండి పని చెయ్యొచ్చు. అందుకే పూర్తిగా రాజకీయాల్లోకి రావాలని డిసైడై కేసీఆర్ ను రిక్వెస్ట్ చేసిన. ఒక తెలంగాణ అధికారిగా కేసీఆర్ ను పెద్దాయనగా భావించి ప్రేమతో పాధాబివందనం చేసిన. దాన్ని వక్రీకరించుడు తప్పు. రాష్ట్రపతికి, ప్రధానికి, పుట్టపర్తి సాయిబాబాకు కాళ్లు మొక్కడం చూసినం. నకిలీ విత్తనాలమ్మే వాళ్లపై కామెంట్లను కూడా వక్రీకరించిన్రు. రాజ్ పుష్ప సంస్థలో లీడర్లకు వాటాల్లేవు. అది 1992లో పౌల్ట్రీ ఫాంగా మొదలై తెలంగాణలో ఇన్నేండ్లుగా పని చేస్తున్నది. అండ్ల నేను మేనేజింగ్‌‌ పార్లనర్ ను” అని చెప్పారు.