The Rajasaab: తెలంగాణలో రాజాసాబ్‌ టికెట్‌ ధరల పెంపు.. సింగిల్‌, మల్టీప్లెక్స్‌ల్లో రేట్ ఎలా ఉందంటే?

The Rajasaab: తెలంగాణలో రాజాసాబ్‌ టికెట్‌ ధరల పెంపు.. సింగిల్‌, మల్టీప్లెక్స్‌ల్లో రేట్ ఎలా ఉందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్’ ఇవాళ (జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. అయితే తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు పడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి జీవో (GO) విడుదల కాకపోవడంతో రాత్రి 9 గంటలకు ప్రారంభం కావాల్సిన షోలు నిలిచిపోయాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

అయితే, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వకపోయినా, టికెట్ ధరల పెంపుకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం (జనవరి 8) అర్థరాత్రి తర్వాత టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీంతో బుక్‌మైషో, పేటీఎం, ఇతర టికెట్ యాప్స్‌లో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. జనవరి 9 నుంచి 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్‌లలో రూ. 132 వరకు పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ ధరలు జనవరి 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ. 62, మల్టీప్లెక్స్‌లలో రూ. 89 వరకు పెంపునకు అనుమతి ఇచ్చారు. అలాగే, టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉండగా, 2026 సంక్రాంతి బరిలో ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’తో పాటు చిరంజీవి–అనిల్ మూవీ, రవితేజ–కిషోర్ తిరుమల సినిమాలు కూడా పోటీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల కేటాయింపు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ‘ది రాజా సాబ్’కు తగినన్ని థియేటర్లు దక్కడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ థియేటర్ సమస్య సినిమా కలెక్షన్లపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.