- మండలాల మార్పులకు అధికారులతో స్టడీ
- ‘మెగా హైదరాబాద్’ను 3 జిల్లాలుగా చేసే యోచన
- గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన
- ఒక నియోజకవర్గంలోని మండలాలు రెండు, మూడు జిల్లాల్లోకి
- పాత జిల్లాకేంద్రాల నుంచి 30 కి.మీ. లోపు మండలాలు సైతం ఇతర జిల్లాలోకి
- సమీప జిల్లాలో సర్దుబాటు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లు
- రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్‌కు అనుగుణంగా మార్పులు
- ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటనతో మొదలైన కార్యాచరణ
- జనగణనకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రణాళికలు
హైదరాబాద్, వెలుగు: జిల్లాల సరిహద్దుల గజిబిజిని సరిదిద్దేలా భౌగోళిక స్వరూపంలో మార్పు చేర్పులు జరగనున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో గత ప్రభుత్వం హడావుడిగా, అశాస్త్రీయంగా చేపట్టిన జిల్లాల విభజన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఉన్నతాధికారులతో భేటీ అయి జిల్లాల సరిహద్దుల మార్పు, మెగా హైదరాబాద్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారు. ఈ లెక్కన అతి త్వరలోనే జిల్లాల పునర్విభజన, సరిహద్దులు సవరించడం తప్పదని తెలుస్తున్నది. ఈ మేరకు జిల్లా కేంద్రాల నుంచి మండలాలకు మధ్య ఉన్న భౌగోళిక దూరాలు, ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. ఇటీవల మెగా హైదరాబాద్‌గా ఏర్పడిన జీహెచ్ఎంసీని సైతం మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయడంపైనా కసరత్తు ప్రారంభించారు. కాగా, కేంద్రం చేపట్టబోయే జనగణనకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను డిసెంబర్ 31నే అధికారులు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చడం, కొత్త జిల్లాల ఏర్పాటు లాంటివి చేస్తే తలెత్తే సమస్యలనూ అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లు తెలుస్తున్నది.
‘అశాస్త్రీయ’ విభజనతో తిప్పలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కు పెంచినప్పటికీ, ఆ ప్రక్రియలో కనీస ప్రమాణాలు పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ రాజకీయ అవసరాల కోసం మండలాలను ఇష్టమొచ్చినట్లుగా వివిధ జిల్లాల్లో కలపడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధానంగా ఒకే నియోజకవర్గంలోని మండలాలను రెండు, మూడు జిల్లాల్లో విలీనం చేయడం, పాత జిల్లా కేంద్రాలకు కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను, బలవంతంగా 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త జిల్లాల్లో కలపడం లాంటివి చేశారు. దీంతో చిన్న చిన్న పనుల కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లే పేదలు, రైతులకు వ్యయ, ప్రయాసలు తప్పడం లేదు. ‘‘గతంలో మా ఊరుకు 20 కిలోమీటర్ల దూరంలోనే కరీంనగర్ ఉండేది. ఇప్పుడు సిద్దిపేటలో కలపడం వల్ల 40 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. గతంలో ఆటో ఎక్కితే అరగంటలో కరీంనగర్లో ఉండేవాళ్లం. ఇప్పుడు సిద్దిపేట వెళ్లాలంటే సరిపడా బస్సులు లేక ఇబ్బందిగా ఉంది..గంటకు పైగా పడ్తోంది..’ అని బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన సురేశ్ వాపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాల్లోనూ జనం ఇట్లాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన మంత్రి పొంగులేటి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా, వారికి అందుబాటులో ఉండేలా జిల్లాల సరిహద్దులను ‘రీ-ఆర్గనైజ్’ చేస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేసిన తీరు లోపభూయిష్టంగా ఉందని, ప్రజల సౌలభ్యాన్ని గాలికొదిలేసి రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన చేశారని పలుమార్లు సీఎం రేవంత్సైతం విమర్శించారు.
ఒక్క నియోజకవర్గం.. మూడేసి జిల్లాలు..
జిల్లాల విభజన జరిగిన తీరు పాలన సౌలభ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, రాజకీయంగానూ గందరగోళానికి దారితీసింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మండలాలను రెండు, కొన్ని చోట్ల మూడు జిల్లాల్లో కలిపేశారు. దీంతో సదరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ముగ్గురు కలెక్టర్లు, ముగ్గురు ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. మూడు జడ్పీ మీటింగులకూ హాజరుకావాల్సి వస్తున్నది. ఈ అస్తవ్యస్త విధానం వల్ల అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలులోనూ జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది.
ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)ను దృష్టిలో ఉంచుకుని, ఒక నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా లేదా గరిష్టంగా రెండు జిల్లాలకు పరిమితమయ్యేలా సరిహద్దులు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. దీనివల్ల పోలీస్ సబ్ డివిజన్లు, రెవెన్యూ డివిజన్ల మధ్య పొంతన కుదిరి పాలన గాడిలో పడుతుందని భావిస్తున్నది. ఉదాహరణకు ఒక్క మునుగోడు నియోజకవర్గం యదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. అలాగే పాలకుర్తి నియోజకవర్గం జనగామ, మహబూబాబాద్, మనుమకొండజిల్లాలో ఉండగా, వర్ధన్నపేట, మానకొండూర్, హుస్నాబాద్ వంటి నియోజకవర్గాలు కూడా మూడేసి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి.
ప్రజల నుంచి విజ్ఞప్తులు..
జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న సంకేతాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తమ మండలాన్ని సమీపంలోని జిల్లాలో కలపాలంటూ వినతులు వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల పరిధిలోని సరిహద్దు మండలాల ప్రజలు ఈ మార్పును బలంగా కోరుకుంటున్నారు. జనగామ, హనుమకొండ జిల్లాల మధ్య, అలాగే వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల మధ్య ఉన్న అశాస్త్రీయతను సవరించాలని డిమాండ్లు వస్తున్నాయి. కేవలం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న జిల్లాల్లోనే మండలాలను ఇటు నుంచి అటు మార్చడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని అధికారులు ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదించినట్లు సమాచారం.
మూడు జిల్లాలుగా ‘మెగా హైదరాబాద్’
హైదరాబాద్ మహానగరం నానాటికీ విస్తరిస్తుండడంతో ఇక్కడి జిల్లాల స్వరూపాన్ని పూర్తిగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- జిల్లాల పరిధిలో భౌగోళిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా విస్తీర్ణం తక్కువగా ఉండగా, మిగిలిన రెండు జిల్లాలు పరిపాలనకు అందనంత విస్తారంగా ఉన్నాయి. అదే సమయంలో ఓఆర్ఆర్ అనుకుని, లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో మెగా హైదరాబాద్‌గా జీహెచ్ఎంసీ అవతరించింది. ఇప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని కలుపుకొని మూడు సమాన స్థాయి జిల్లాలుగా విభజించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ విధానం వల్ల ట్రాఫిక్ నిర్వహణ, శాంతి భద్రతలు, మున్సిపల్ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర స్టడీ చేసి నివేదిక ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాజాగా ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు.
అంతా గజిబిజి.. మచ్చుకు కొన్ని..
వరంగల్: వరంగల్ నగరాన్ని వరంగల్, హనుమకొండ జిల్లాలుగా విభజించడంతో మున్సిపల్, పోలీస్ పనులకు ఇద్దరు కలెక్టర్ల సమన్వయం తప్పనిసరైంది. చారిత్రక నగరం రెండుగా చీలిపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని, తిరిగి ఏకం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
హుస్నాబాద్: హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ మూడు జిల్లాల (సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ) పరిధిలోకి వెళ్లడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని స్థానికులు 50 రోజులుగా దీక్షలు చేస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా: తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. దీనివల్ల ఏ పథకం అమలు చేయాలన్నా వివిధ జిల్లాల అధికారులను సమన్వయం చేసుకోవడం కష్టంగా మారింది.
మచ్చుకు కొన్ని..
- బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. మూడు మండలాలు కామారెడ్డిలో, ఐదు మండలాలు నిజామాబాద్ జిల్లాలో ఉండడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
- మానాల: బాల్కొండ నియోజకవర్గంలోని మానాల గ్రామాన్ని సిరిసిల్ల జిల్లాలో కలిపారు. వీరు అసెంబ్లీకి నిజామాబాద్ ఓటర్లుగా, లోకల్ బాడీ ఎన్నికలకు సిరిసిల్ల పరిధిలో ఉంటున్నందున, తమను తిరిగి పాత మండలం కమ్మర్పల్లిలోనే ఉంచాలని కోరుతున్నారు.
- హనుమకొండ: హనుమకొండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధి ఇతర జిల్లాల్లో కూడా విస్తరించి ఉంది. నియోజకవర్గ కేంద్రం ఒక జిల్లాలో, మండలం మరో జిల్లాలో ఉండటం వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా: సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉంది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు దీనిపై హామీ ఇచ్చారు.
- భద్రాచలం: రాష్ట్ర విభజన, జిల్లాల పునర్విభజనతో భద్రాచలం నియోజకవర్గం అస్తవ్యస్తమైంది. వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లాలోకి వెళ్లడంతో ఈ గిరిజన నియోజకవర్గం చిన్నాభిన్నమైంది.
- ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ వంటి మండలాలు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో ఉండగా, మరికొన్ని మండలాలు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. దీంతో జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రం వేరు కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
- పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో కలిసింది. మంథని నియోజకవర్గం కూడా రెండు జిల్లాల (పెద్దపల్లి, భూపాలపల్లి) మధ్య విభజించడంతో సంక్షేమ పథకాల అమలులో గందరగోళం నెలకొంది.
- ఇల్లందు: ఇల్లందు నియోజకవర్గ మండలాలు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉండగా, భద్రాద్రి జిల్లాలోని జూలూరుపాడు వైరా నియోజకవర్గంలో ఉంది. మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు మధ్య దూరం పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
- నిర్మల్ ఖానాపూర్: ఖానాపూర్ నియోజకవర్గం ఏకంగా మూడు జిల్లాల్లో (నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్) విస్తరించి ఉంది. ఎనిమిది మండలాలు మూడు వేర్వేరు జిల్లాల పరిధిలోకి రావడంతో పాలన ప్రజలకు దూరమవుతోంది.
- మెదక్ రేగోడ్: ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఉన్న రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని ఆ మండల వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం కూడా ఇచ్చారు.
- యాదాద్రి జిల్లా: యాదాద్రి జిల్లాలోని పలు మండలాలు ఇతర జిల్లాల (సూర్యాపేట, నల్గొండ) నియోజకవర్గాల్లో కలవడంతో అభివృద్ధిలో అసమానతలు ఉన్నాయి. మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల పరిధి యాదాద్రి జిల్లాలో విస్తరించి ఉంది.
