స్వతంత్ర పోరాటంలో కళారూపాలది కీలకపాత్ర: వెంకయ్యనాయుడు

స్వతంత్ర పోరాటంలో కళారూపాలది కీలకపాత్ర: వెంకయ్యనాయుడు
  •     ఘంటసాల శతజయంతి ఉత్సవాల్లో మాజీ ఉప రాష్ట్రపతి
  •     భారత్ కళామండపం ఆడిటోరియానికి శంకుస్థాపన

మాదాపూర్, వెలుగు : భారతీయ కళారూపాల్లో ఆధ్యాత్మికత, తాత్వికత, జీవన విధానం అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయని మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వార్థం, హింస పెరిగిపోతున్న తరుణంలో భారతీయ వసుధైక కుటుంబ స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా బోధించాల్సిన అవసరం ఉందన్నారు. మన బుర్రకథలు, తొలుబొమ్మలాట వంటి కళారూపాలు స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. గాన గంధర్వ ఘంటసాల శతజయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ సోమవారం సాయంత్రం మాదాపూర్​లోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రెయినింగ్(సీసీఆర్టీ) కాంప్లెక్స్ లో రూ. 3 కోట్లతో నిర్మించనున్న భారత్ కళామండపం ఆడిటోరియానికి ఆయన శంకుస్థాపన చేశారు. సంగీత నాటక అకాడమీ దక్షిణ భారత సాంస్కృతిక కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్​రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకయ్య మాట్లా డారు. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అమర గాయకుడు ఘంటసాల జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం కళామండపం నిర్మాణానికి శ్రీకారం చుట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. 

  • ట్రైబల్ మ్యూజియానికి 14న భూమిపూజ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

కాకతీయుల కాలం నాటి రామప్ప టెంపుల్ కు యునెస్కో గుర్తింపు దక్కేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. వరంగల్​లోని వెయ్యి స్తంభాల మండపాన్ని పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయని, ఈ నెలాఖరులో మండపాన్ని తిరిగి అందుబాటులోకి తెస్తామన్నారు. గోల్కొండ కోట, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో సౌండ్ అండ్ లైటింగ్ షో ప్రారంభించామన్నారు. త్వరలోనే సంజీవయ్య పార్కులో ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్ ట్రైబల్ మ్యూజియం నిర్మాణానికి ఈ నెల 14న భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. కాగా, పద్మ అవార్డులకు ఎంపికైన వెంకయ్యనాయుడితోపాటు దాసరి కొండప్ప, కేతావత్ సోమ్లా, గడ్డం సమ్మయ్య, ఉమామహేశ్వరి, వేలు ఆనందచారిని ఈ సందర్భంగా కిషన్​రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో సీసీఆర్టీ చైర్మన్ వినోద్ కుమార్, సంగీత నాటక అకాడమీ చైర్మన్ డా. సంధ్య పురేచ, కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి, ప్రముఖ గాయని పి.సుశీల, పారిశ్రామికవేత్త అల్లూరి సీతారామరాజు, గాయకులు గంగాధర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.