ఫార్ములా ఈ రేస్ కేసు.. ACB దర్యాప్తు ఫైనల్ రిపోర్ట్లో కళ్లు చెదిరే వాస్తవాలు

ఫార్ములా ఈ రేస్ కేసు.. ACB దర్యాప్తు ఫైనల్ రిపోర్ట్లో కళ్లు చెదిరే వాస్తవాలు

హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ కేసులో సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి ACB ఫైనల్ రిపోర్ట్ సమర్పించింది. 2024 డిసెంబర్ 19న ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3 గా బిఎల్ఎన్ రెడ్డి, ఏ4 గా, ఏ5గా FEO ప్రతినిధులను చేర్చింది. దర్యాప్తులో కీలక అంశాలను ఏసీబీ కనుగొంది. హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలనేది కేటీఆర్ సొంత నిర్ణయం అని ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేట్ డిస్కషన్లతో రేస్ నిర్వహించారని, క్విడ్ ప్రో కో జరిగిందని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారని, ట్రైపార్టీ అగ్రిమెంట్కి ముందే ఎలక్ట్రోరల్ బాండ్స్ను చెల్లించారని గుర్తించింది.

2022 ఏప్రిల్, అక్టోబర్ నెలలో ఈ బాండ్స్ను చెల్లించారని ఏసీబీ తెలిపింది. బీఆర్ఎస్కు ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చినందుకు ace NXT genకు ప్రమోటర్గా అవకాశం కల్పించారని ఏసీబీ విచారణలో తేలింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 166(1), 299 నిబంధనలను ఉల్లంఘించారని, గవర్నర్ సంతకంతో ఎగ్జిక్యూట్ చేయాల్సిన కాంట్రాక్టులను కాంపిటీట్ అథారిటీ అనుమతి లేకుండానే ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్రూవ్ చేశారని ఏసీబీ విచారణలో వెల్లడైంది. రెండు అగ్రిమెంట్లు కూడా గవర్నర్ నోటీసులో లేవని, MAUD  నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని ఏసీబీ స్పష్టం చేసింది.

హెచ్ఎండీఏ ప్రమోటర్గా ఉండేందుకు HMDA నిధులను ఉపయోగించారని పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక శాఖకు సైతం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, బిజినెస్ రూల్స్ను ఉల్లంఘిస్తూ అప్పటి రాష్ట్ర సీఎస్కు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రికి, అప్పటి ముఖ్యమంత్రికి కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఫైనల్ రిపోర్ట్లో ఏసీబీ పేర్కొంది.  ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో 10 కోట్ల కంటే అధిక నిధులు చెల్లించాల్సి వస్తే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, 2023 అక్టోబర్ 9 నుండి డిసెంబర్ 4 వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఏసీబీ గుర్తు చేసింది.