- గవర్నర్ కు ఎఫ్జీజీ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన రూ.లక్ష కోట్ల భూదోపిడీ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఆయన లేఖ రాశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గచ్చిబౌలిలో హోటల్స్ ఉన్నాయని సీఎం చెప్పారన్నారు.
ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ విషయాల్లో కేటీఆర్ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేశారన్నారు. వీన్నింటిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. భూ దోపిడీ విషయంలో ప్రజలకు నిజానిజాలు తెలియజేసేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.
