అన్ని రంగాల్లో సీమాంధ్రుల పెత్తనం తగ్గించాలి

అన్ని రంగాల్లో సీమాంధ్రుల పెత్తనం తగ్గించాలి
  • తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం నిర్మూలించినప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేర్కొంది. ప్రస్తుతం సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం పెరిగిందని చెప్పింది. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫోరం ఆధ్వర్యంలో ‘తెలంగాణ పునర్నిర్మాణం – ఉద్యమకారుల కర్తవ్యం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

జస్టిస్ చంద్రకుమార్, కోలా జనార్దన్, ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అన్ని రంగాలతోపాటు ఉద్యమకారులను విస్మరించారని మండిపడ్డారు. కాంగ్రెస్​ప్రభుత్వమైనా తెలంగాణ పునర్నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం హామీని వెంటనే నెరవేర్చి, ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.

అన్ని రంగాల్లో సీమాంధ్రుల పెత్తనం తగ్గించి, ప్రతి పేద కుటుంబానికి ఉచిత విద్య, వైద్యం అందేలా చూడాలన్నారు. తెలంగాణ సినిమా పాలసీని ప్రకటించాలని, రైతుబంధును 5 ఎకరాలకే పరిమితం చేయాలని డిమాండ్​చేశారు. పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో కరుణాకర్ రెడ్డి, బల్దేవ్ రెడ్డి, విష్ణువర్ధన్, కొంతమా యాదిరెడ్డి, జ్యోతి రెడ్డి, ఇంద్ర కుమార్, అనంతలక్ష్మి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.