ఫండ్స్​ కోసమని వెళ్తే.. టీఆర్ఎస్ కండువాలు కప్పిన్రు

ఫండ్స్​ కోసమని వెళ్తే.. టీఆర్ఎస్ కండువాలు కప్పిన్రు

హైదరాబాద్‌‌‌‌, యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి చెందిన నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు శనివారం టీఆర్ఎస్‌‌‌‌లో చేరిన విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి, నిధుల గురించి చర్చిద్దామని చెప్పి ఎమ్మెల్యే గొంగిడి సునీత.. మంత్రి కేటీఆర్ దగ్గరకు తీసుకెళ్లి బలవంతంగా టీఆర్ఎస్ కండువాలు కప్పారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేశ్ యాదవ్, బిట్టు సరోజ చెప్పారు. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వచ్చిన ఇద్దరు కౌన్సిలర్లు శనివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్ని నిధులైనా ఇస్తాం.. మీరు మా వెంట ఉండండి’’ అని కేటీఆర్ చెప్పారని తెలిపారు. చర్చల కోసం ప్రగతి భవన్‌‌‌‌లోని ఓ హాల్ లోకి తీసుకెళ్లారని, తమ సెల్ ఫోన్లు లాక్కొని, స్విచ్ఛాఫ్ చేసి తాము వద్దంటున్నా బలవంతంగా తమ మెడలో టీఆర్ఎస్ కండువాలు కప్పారని చెప్పారు. తాము కాంగ్రెస్‌‌‌‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్​చార్జ్​ బీర్ల అయిలయ్యను కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. అంతకుముందు హైదరాబాద్‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌.. కౌన్సిలర్లు వాణి, అరుణ, మల్లేశ్‌‌‌‌, సరోజ, కాంగ్రెస్‌‌‌‌ పట్టణ అధ్యక్షుడు భరత్‌‌‌‌గౌడ్‌‌‌‌, నల్గొండ డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి, ఎంపీటీసీలు పద్మావతి, మౌనికకు టీఆర్​ఎస్​ కండువాలు కప్పారు.