
నాంపల్లి పరిధిలోని బజార్‌ఘాట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటన మృతుల కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నాలుగు రోజుల పసికందు కూడా మృతిచెందినట్లుగా తెలిపారు. పుట్టిన నాలుగు రోజులకే పసికందు చనిపోవడంతో కుటుంబసభ్యులు విలవిలాడిపోతున్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందారని, 8 మంది అపస్మార స్థితిలో వెళ్లారని పోలీసులు తెలిపారు. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ అపార్ట్మెంట్ ఓనర్ రమేష్ జైస్వాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రమేష్ కు నగరంలో పలు కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ , సెల్లర్ లో అతను కెమికల్ డ్రమ్స్ నిలువ ఉంచారు.
నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న ఓ నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్ లో నవంబర్ 13వ తేదీన ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటం.. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.