హైదరాబాద్​లో 4 గంటలు కుండపోత..

హైదరాబాద్​లో 4 గంటలు కుండపోత..
  • తెల్లవారుజాము 4 నుంచి 8 గంటల వరకూ భారీవాన
  • అత్యధికంగా సరూర్ నగర్​లో 13.5 సెంటీ మీటర్ల వర్షపాతం
  • పలుచోట్ల నీటమునిగిన కాలనీలు.. 
  • పంజాగుట్ట, నిజాంపేటలో పిడుగులు..ఇండ్లకే పరిమితమైన జనం
  • ముషీరాబాద్​లో వరద నీటిలో కొట్టుకుపోయి యువకుడి మృతి
  • పలుచోట్ల పర్యటించి, చర్యలను పర్యవేక్షించిన  మేయర్, కమిషనర్ 


నిజాంపేట్​లోని మధురానగర్ కాలనీలో ఉన్నతి అపార్ట్​మెంట్ వద్ద పిడుగుపడింది. పిడుగుపాటుకు లిఫ్ట్ డోర్, గోడ ధ్వంసమైంది. భారీ శబ్దం రావడంతో అపార్ట్​మెంట్​ వాసులు భయాందోళనకు గురయ్యారు. ముషీరాబద్ లోని ఆదర్శనగర్ కాలనీలో వరదల్లో కారు కొట్టుకుపోయింది. బషీర్ బాగ్ సీసీఎస్ పాత కార్యాలయానికి అనుకొని ఉన్న గోడ కూలడంతో  అక్కడ పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ వర్షానికి తడిసిన ఎల్బీ స్టేడియం ప్రహరీ కూలింది. ఎర్రమంజిల్​ కాలనీలోని  శాంతి సౌధ అపార్ట్​మెంట్​ ప్రహరీ కూలిపోయింది. దాని గోడకు ఆనుకుని ఉన్న భారీ వృక్షం ఎదురుగాఉన్న శిల్ప అపార్ట్​మెంట్​ప్రహరీపై పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. డీఆర్ఎఫ్​ బృందం వచ్చి కూలిన చెట్టుని  తొలగించింది. 

4 గంటల్లోనే 10 సెంటీ మీటర్లకుపైగా వర్షపాతం

భారీ వర్షంతో నాగోల్, టోలిచౌకి, బేగంపేట, సరూర్ నగర్, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లో  జనం ఇండ్లకే పరిమితమయ్యారు. పలు ఇండ్లలోకి నీరు చేరగా.. ఇబ్బందిపడ్డారు. పలువురు భయంతో పరుగులు పెట్టారు. మధ్యాహ్నం వరకు కూడా కొన్నిచోట్ల నీరు క్లియర్ కాలేదు. చాలాప్రాంతాల్లో చెట్లు కూలగా, ఇంకొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సరూర్ నగర్, ఖైరతాబాద్, ఉప్పల్, రాజేంద్రనగర్, మారేడ్​పల్లి, బహదూర్ పురా, గోల్కొండ, నాంపల్లి, కుత్బుల్లాపూర్, డబీర్ పురా, ముషీరాబాద్ ప్రాంతాల్లో 4 గంటల్లోనే 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్ లో అత్యధికంగా 13.23 సెంటీ మీటర్ల వాన పడింది. ఇంతటి భారీ వర్షం కురవడం ఈ సీజన్ లో ఇదే తొలిసారి.  

రంగారెడ్డి జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే పాఠశాలలకు డీఈవో సెలవు ప్రకటించారు. ప్రధాన రహదారులు మొదలుకొని అంతర్గత రహదారులు చెరువులను తలపించాయి. వరంగల్, విజయవాడ హైవేలపై భారీగా వరద చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మధ్యాహ్నం వరకు నగరంలోని చాలాచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. లోత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టు ప్రాంతాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నీ నీళ్లతో నిండిపోయాయి.  ట్రాఫిక్ కారణంగా మెట్రో రైళ్లకు మరింత రద్దీ పెరిగింది.  భారీ వర్షంతో మూసీకి వరద ఉధృతి పెరిగింది. ముసారాంబాగ్ వద్ద బ్రిడ్జికి ఆనుకొని ప్రవహిస్తున్నది. మరింత ఉధృతి పెరిగితే రాకపోకలు నిలిచిపోనున్నాయి.  భారీ వర్షం వల్ల జీహెచ్ఎంసీకి  300కు పైగా ఫిర్యాదులు అందాయి. నీరు నిలిచినట్టు ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రాగా..  ఇందులో 158 ప్రాంతాల్లో సమస్య పరిష్కరించారు. చెట్లు కూలినట్టు 41 కాల్స్ రాగా, ఇందులో 30 చోట్ల క్లియర్ చేశారు.  

వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి 

ముషీరాబాద్ డివిజన్ బాపిస్ట్ చర్చి వద్ద విజయ్ (42) వరదలో కొట్టుకుపోయి, మృతి చెందాడు. తన అన్న నిర్మిస్తున్న ఇంటి వద్దకు తెల్లవారుజామున వచ్చిన అతడు వరద నీటిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.  ఘటనా స్థలానికి చేరుకున్న ముషీరాబాద్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. పార్సిగుట్టలో తెల్లవారుజామున రోడ్డుపై ప్రవహిస్తున్న వరదలో ద్విచక్ర వాహనంతో పాటు ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. 

హుస్సేన్ సాగర్​కు పెరిగిన వరద 

భారీ వర్షం వల్ల హుస్సేన్ సాగర్​కు వరద పెరుగగా, నిండు కుండలా మారింది.  భారీగా వరదనీరు చేరుతుండడంతో  అధికారులు నీటిని బటయకు పంపుతున్నారు.  హుస్సేన్ సాగర్ లోకి వస్తున్న వరద పరిస్థితిని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు 24 గంటలపాటు పరిశీలిస్తున్నారు.  సాగర్ ఎఫ్ టీఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా.. శనివారం సాయంత్రానికి  నీటిమట్టం 513.63 మీటర్లకు చేరింది.  హుస్సేన్ సాగర్ ఇన్ ఫ్లో 2,500 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,300 క్యూసెక్కులుగా ఉంది.

మేయర్ టెలీకాన్ఫరెన్స్ 

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అప్రమ్తతం చేశారు.  జోనల్ కమిషనర్లతో వర్షాలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు ఫీల్డ్ లో ఉండాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  కిందిస్థాయి అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేయాలని, వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన నీటిని వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. 

పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్

వర్షాల నేపథ్యంలో మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పర్యటించారు. మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, గుడిమల్కాపూర్, విజయనగర్ కాలనీ, మాసబ్ ట్యాంక్, అత్తాపూర్ ప్రాంతంలో పర్యటించి, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రహదారుల పై  నిలిచిన వర్షపు నీరు వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎప్పటికప్పుడు  ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు  తీసుకోవాలని జోనల్ డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించారు. అనంతరం అడిషనల్, జోనల్ కమిషనర్​తో ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాన రహదారి పై ప్రాజెక్టు సైట్ వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారుల పై మరమ్మతులు చేస్తున్న స్థలం వద్ద ప్రమాదం సంభవించకుండా బారికేడ్లు, హెచ్చరిక బోర్డు లతో పాటు రాత్రి సమయంలో లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బహుళ అంతస్థుల నిర్మాణాలు, నాలాలు,  నీటి వనరుల వద్ద కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.  

సాయంత్రం మరోసారి దంచికొట్టిన వాన

నగరంలో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల సమయంలో మరోసారి వర్షం దంచికొట్టింది. ఖైరతాబాద్​లో అత్యధికంగా 6.03 సెం.మీ. వాన కురిసింది. 2 గంట వ్యవధిలోనే  భారీ వర్షం కురవడంతో మరోసారి జనానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో  ఇబ్బందులు పడ్డారు.