- ములుగు జిల్లాలో గోదావరిలో మునిగి మేనమామ, మేనల్లుడు..
- మేడ్చల్ జిల్లాలో చెరువులో పడి అన్నదమ్ములు మృతి
ఈత కొట్టేందుకు వెళ్లి నలుగురు మృతి చెందారు. ములుగు జిల్లాలో ఇద్దరు, మేడ్చల్ జిల్లాలో మరో ఇద్దరు దుర్మరణం చెందారు. గోదావరి నదిలో ఇద్దరు గల్లంతు కాగా, చెరువులో మునిగి మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
ఏటూరు నాగారం, వెలుగు: సరదాగా ఈత కొట్టేందుకు గోదావరిలోకి వెళ్లిన మేనమామ, మేనల్లుడు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలో ఆదివారం జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరుకు చెందిన జిట్ట ఈశ్వవర్ధన్ (20) ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు.
వేసవి సెలవులు కావడంతో రెండు రోజుల కింద కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ఆదివారం తన మేనమామ, ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న బొమ్మిరాజు నరేశ్ (30)తో పాటు అదే గ్రామానికి చెందిన సంపత్‌తో కలిసి గోదావరిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. నదిలో దిగగానే లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురూ నీటిలో మునిగిపోయారు.
సంపత్ అతికష్టం మీద బయటపడగా.. మిగతా ఇద్దరూ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్ ఘటనాస్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లు, గ్రామస్తుల సహకారంతో నదిలో గాలించగా ఇద్దరి డెడ్‌బాడీలు దొరికాయి. ఈతకు వెళ్లి మేనమామ, మేనల్లుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క.. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుల బంధువులను ఫోన్‌లో పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
జవహర్‌నగర్‌లో అన్నదమ్ములు...
జవహర్‌నగర్, వెలుగు : ఈత కొట్టేందుకు చెరువుకు వెళ్లిన అన్నదమ్ములు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని కౌకూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదర్శనగర్ ఫేజ్ 2లో ఉంటున్న ఆకుల రాములు, అనసూయ దంపతులకు నలుగురు కుమారులు. రెండో కుమారుడు ఆకుల మోహన్ (38), మూడో కుమారుడు కృష్ణ (32) క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. మోహన్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా, కృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆదివారం మధ్యాహ్నం మోహన్, కృష్ణ కలిసి ఈత కొట్టేందుకు కౌకూర్ చెరువు వద్దకు వెళ్లారు. మొదట కృష్ణ చెరువులోకి దిగగా.. నీటిలో మునిగిపోతుండడంతో గమనించిన మోహన్ అతడిని కాపాడేందుకు ప్రయత్నించి అతడు కూడా నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలించగా.. ఇద్దరి మృతదేహాలు దొరికాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
