70 ఏండ్ల బల్దియా చరిత్రలో నలుగురు మహిళలు

70 ఏండ్ల బల్దియా చరిత్రలో నలుగురు మహిళలు

గ్రేటర్​ మేయర్​గా
గద్వాల విజయలక్ష్మి ఎన్నిక
బల్దియాలో ఇప్పటివరకు
మొత్తం 18 మంది మేయర్లు
పూర్తికాలం పనిచేయని
గత మహిళా మేయర్లు

హైదరాబాద్, వెలుగు: బల్దియా మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఎన్నిక కావడంతో ఈ పదవి దక్కించుకున్న నాలుగో మహిళగా రికార్డులకెక్కారు. 70 ఏళ్ల బల్దియా చరిత్రలో మొత్తం18 మంది మేయర్లుగా బాధ్యతలు చేపట్టారు.  హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ గా 1962 లో రాణి కుముదిని దేవి ఎన్నికయ్యారు. సికింద్రాబాద్, హైదరాబాద్ ను కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి మేయర్ గా ఆమె ఎన్నికయ్యారు. హైదరాబాద్ సంస్థానం చివరి ఉపప్రధాని పింగళి వెంకట రమణారెడ్డి కూతురిగానూ, వనపర్తి సంస్థానాధీశులైన రాజా రామ్ దేవ్ రావు భార్యగా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె మేయర్ గా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె పాలనకాలంలో సిటీకి వరదలు రావడంతో డైరెక్ట్ గా అప్పటి ప్రధాని నెహ్రూతో మాట్లాడి వరదసాయం నిధులు తెప్పించారు. 1965 లో సరోజిని పుల్లారెడ్డి కి రెండో మహిళా మేయర్ గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ మహిళలకు  అవకాశం రాలేదు.  సుమారు 44 ఏళ్ల తర్వాత 2009 లో బండ కార్తీకరెడ్డి కాంగ్రెస్ నుంచి మేయర్ గా ఎన్నికయ్యారు. మేయర్ సీటు జనరల్ కు కేటాయించినప్పటికీ మహిళకు అవకాశం ఇచ్చారు. 1962 లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత ఫస్ట్ మేయర్ మహిళకే దక్కగా, జీహెచ్ఎంసీ ఏర్పాటైన వెంటనే మళ్లీ మహిళకు మేయర్ గా చాన్స్ ఇవ్వడం విశేషం. నాలుగో మహిళా మేయర్ గా గురువారం ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి తెలంగాణ వచ్చాక తొలి మహిళా మేయర్ గా రికార్డులకెక్కారు.

పూర్తి కాలం పనిచేయలె

ఇప్పటి వరకు ముగ్గురు మహిళలే మేయర్లు కాగా వాళ్లెవరు పూర్తి కాలం పదవిలో లేరు. రాణి కుముదిని రెండేళ్లు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత సరోజిని పుల్లారెడ్డి ఏడాది పాటు మేయర్ గా పనిచేశారు.  బండ కార్తీకా రెడ్డి మూడేళ్లు పదవిలో ఉన్నారు. కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా మిగతా రెండేళ్లు మేయర్ పోస్ట్ ను ఎంఐఎం కు కేటాయించారు. నాలుగో మహిళ మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి పూర్తి కాలం మేయర్ గా పనిచేస్తే ఐదేళ్ల పాటు మేయర్ గా ఉన్న తొలి మహిళగా రికార్డు సృష్టిస్తారు.

తార్నాక డివిజన్ స్పెషల్
అప్పట్లో మేయర్, ఇప్పుడు డిప్యూటీ మేయర్

సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్ లో తార్నాక డివిజన్ స్పెషల్​గా నిలిచింది. 2009 లో ఇదే డివిజన్ నుంచి బండ కార్తీకా రెడ్డి మేయర్ గా ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీ ఏర్పాటైన తర్వాత ఫస్ట్​ మేయర్ సీటు డివిజన్ కే  దక్కింది. మళ్లీ ఇప్పుడు మోతె శ్రీలత రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. ఒకే డివిజన్ ​నుంచి ఇద్దరు మహిళలు ఇలా ఎన్నికవడం  విశేషం.  దీంతో డివిజన్​ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2016 లోనూ ఎన్నికైన కార్పొరేటర్ సరస్వతి కూడా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్​గా కొనసాగారు.  వరుసగా మూడు ఎన్నికల్లో తార్నాక కార్పొరేటర్ గా ఎన్నికైన వారు ఏదో ఒక ఉన్నత పదవిని చేపడుతున్నారు.