నేడు(ఆగస్టు26) .. జీ-20 కల్చరల్‌‌ డిక్లరేషన్‌‌

నేడు(ఆగస్టు26) .. జీ-20 కల్చరల్‌‌ డిక్లరేషన్‌‌
  • హాజరుకానున్న దేశాల సాంస్కృతిక మంత్రులు
  • చీఫ్​గెస్ట్​గా యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్

న్యూఢిల్లీ, వెలుగు: వారణాసిలో శనివారం నిర్వహించనున్న జీ–20 చివరి మీటింగ్ లో కల్చరల్‌‌ డిక్లరేషన్‌‌ ప్రకటిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వారణాసిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన వెబినార్​లో జీ20 దేశాలతో పాటు వివిధ అంతర్జాతీయ సంస్థలు, భాగస్వామ్య పక్షాల నుంచి 159 మంది పాల్గొన్నారని వెల్లడించారు. ఈ చర్చల ద్వారా సేకరించిన సమాచారంతో వారణాసి డిక్లరేషన్‌‌ రెడీ చేసినట్లు చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంతోపాటు వివిధ అంశాలపై చర్చించేందుకు జీ–20 కల్చరల్ మినిస్టర్ గ్రూప్ చివరిసారి భేటీ కానుందన్నారు. ఈ మీటింగ్​కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని పేర్కొన్నారు. శనివారం నాటి జీ–20 సదస్సులో సభ్యదేశాలు, ఎనిమిది ఆహ్వానిత దేశాల సాంస్కృతిక శాఖ మంత్రులు, ఆరు అంతర్జాతీయ సంస్థల సభ్యులు హాజరవుతారని తెలిపారు.

దీంతో జీ20 సాంస్కృతిక శాఖ జీ20 సమావేశాలు పూర్తవుతాయని చెప్పారు. అంతకుముందు వారణాసిలో ఏర్పాటుచేసిన ‘సాంస్కృతిక విరాసత్‌‌ స్పర్ధ –2023’లో భాగంగా యువ టూరిజం క్లబ్‌‌ కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. స్టూడెంట్లలో సేవా తత్పరత, దేశంపై అవగాహన పెంచే లక్ష్యంతోనే.. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘యువ టూరిజం క్లబ్స్‌‌’ను ప్రారంభించామన్నారు.  దేశవ్యాప్తంగా విద్యార్థులు స్వచ్ఛందంగా ‘యువ టూరిజం క్లబ్స్‌‌’ లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.