భారత్‌లో ఐఫోన్ల తయారీపై చైనా కుట్ర: మరో 300 మంది ఇంజనీర్లు వెనక్కి!

భారత్‌లో ఐఫోన్ల తయారీపై చైనా కుట్ర: మరో 300 మంది ఇంజనీర్లు వెనక్కి!

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ భారతదేశంపై ప్రకటించిన 25 శాతం అదనపు సుంకాలు త్వరలో అమలులోకి రాబోతున్నాయి. ఆగస్టు 27 నుంచి కొత్త టారిఫ్స్ భారతదేశాన్ని ఇబ్బంది పెడతాయి. అయితే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను దాని నుంచి తప్పించటంతో ఐఫోన్ల తయారీ ఎగుమతిపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే ఐఫోన్ల తయారీకి కొత్త హబ్ గా ఆసియాలో మారుతున్న భారతదేశాన్ని అడ్డుకోవటానికి చైనా కుయుక్తులు మాత్రం ఆపటం లేదు. పైకి అమెరికా టారిఫ్స్ పై ముసకి కన్నీరు కార్చుతూ చైనా-భారత్ మధ్య వ్యాపార బంధాలు బలపడాలని మాట్లాడుతూ వెనుక గోతులు తవ్వుతోంది చైనా. 

కొన్ని వారాల కింద చైనా భారతదేశంలోని ఐఫోన్ల తయారీ ప్లాంట్లలో ఉన్న తమ ఇంజనీర్లను వెనక్కి రావాలని సూచించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ అందుబాటులో లేకుండా నిరోధించటం ద్వారా భారతదేశంలోని ప్లాంట్లలో ఉత్పత్తిని దెబ్బతీయాలని చైనా భావించింది. తాజాగా తన కుట్రలను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది చైనా. దీంతో ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ యుజాన్ టెక్నాలజీ తన భారత యూనిట్ నుంచి దాదాపు 300 మంది చైనీస్ ఇంజనీర్లను వెనక్కి పిలిచింది. ఇదే క్రమంలో బీజింగ్ కూడా ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియును కంపెనీ భారతీయ పెట్టుబడులపై నివేదికను సిద్ధం చేయాలని కోరింది.

వాస్తవానికి యుజన్ టెక్నాలజీ సంస్థ తమిళనాడులో డిస్ప్లే మాడ్యూల్ అసెంబ్లీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏకంగా రూ.13వేల 180 కోట్లను కూడా పెట్టుబడి పెడుతున్నట్లు మే నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా అమెరికాకు ఐఫోన్లను సరఫరా చేసేందుకు అవసరమైన కెపాసిటీని నిర్మిస్తోంది ఇండియాలో. తద్వారా చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు తగ్గించి ఆ ఉత్పత్తిని ఇండియాలోని ప్లాంట్లకు మార్చాలని ఫాక్స్‌కాన్ ప్లాన్ చేసింది. కానీ ఇది చైనాకు అస్సలు మింగుడు పడటం లేదు. ఒకపక్క భారతదేశంతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నట్లు నటిస్తూ మరోపక్క ఎగుమతులను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అయితే చైనా ఇంజనీర్లను ఎందుకు వెనక్కి రమ్మన్నారనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే భారతదేశంలో ఉత్పత్తికి అవసరమైన అధునాతన పరికరాలు, సాంకేతికత బదిలీని పరిమితం చేయటం లేదా అడ్డుకోవటం దీని ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. రానున్న కొన్ని వారాల్లో ఐఫోన్ 17 లాంచ్ కానున్న తరుణంలో తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎందుకంటే ఆ ఫోన్లను తమిళనాడు, కర్ణాటకలోని ఫాక్స్ కాన్ ప్లాంట్లలోనే తయారు చేస్తారు కాబట్టి. అయితే ఈ పరిణామాలను అవకాశాలుగా మలుచుకోవాలని భారత్ భావిస్తోంది.