ఆటల పేరిట లూటీ.. జీహెచ్ఎంసీ సమ్మర్ ​క్యాంపుల్లో దోపిడీ

ఆటల పేరిట లూటీ.. జీహెచ్ఎంసీ సమ్మర్ ​క్యాంపుల్లో దోపిడీ
  • ఆన్​లైన్ బుక్​ చేసుకుని వెళ్తే స్లాట్స్​ ఫుల్​ అంటూ అబద్ధాలు  
  • రూ.10, 50 ఫీజుకు బదులు  వెయ్యి, రూ.2 వేలు వసూలు  
  •  జెర్సీ లు, ట్రాక్స్, షూస్​ తమ దగ్గరే కొనాలని ఒత్తిడి 
  • అందుబాటులో లేని కోచ్​లు 
  • ఉదయం, సాయంత్రం కలిపి 2 గంటల్లోనే కోచింగ్​ ఖతం 
  • గాలికి వదిలేసిన జీహెచ్ఎంసీ ఆఫీసర్లు 


హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ స్పోర్ట్ప్ కాంప్లెక్సుల్లో నిర్వహిస్తున్న  సమ్మర్ క్యాంపుల్లో దోపిడీ చేస్తున్నారు. నిర్ణయించిన ఫీజులకంటే ఎక్కువగా తీసుకుంటూ తల్లిదండ్రుల జేబులను కొల్లగొడుతున్నారు. వెబ్ సైట్ లో  బుక్ చేసుకొని వెళ్లినా స్లాట్స్​ ఫుల్ అంటూ రెగ్యులర్​కోచింగ్ ​ఇస్తామని  రూ.వేలకు వేలు తీసుకుంటున్నారు. పేరెంట్స్​అడిగిన టైంలో కోచింగ్​ఇవ్వాలంటే అదనంగా చెల్లించాలని డిమాండ్ ​చేస్తున్నారు. ఆన్​లైన్​లో బుక్​ చేసుకుని వెళ్లి.. కోచ్ లు స్లాట్స్​ఖాళీ లేవన్నా ప్రశ్నించి జాయిన్​చేస్తే ఆ స్టూడెంట్లను సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఆఫ్​లైన్​లో రిజిస్టర్​ చేసుకుందామని కోచింగ్​ ఇచ్చే ప్లేస్​కు డైరెక్ట్​ వెళ్తే  ఖాళీలు లేవని ప్రైవేట్​ కోచింగ్​ఇస్తామని దండుకుంటున్నారు. 

375 చోట్ల సమ్మర్​ క్యాంపులు

బల్దియా ప్రతి ఏడాది ఎండాకాలంలో సమ్మర్​క్యాంపులు నిర్వహిస్తోంది. వీటి కోసం సుమారు 357 ఇన్​డోర్​, ఔట్​డోర్​ స్టేడియాలను కేటాయించి 915 క్యాంపులను ఏర్పాటు చేసింది. వీటిలో షటిల్, బాల్ ​బ్యాడ్మింటన్, క్రికెట్, రోలర్​స్కేటింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ సహా సుమారు 43 క్రీడల్లో శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 71 మంది పార్ట్ టైమ్ కోచ్​లు ఉండగా, వీరు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తున్నారు. 

నెలకు రూ.11,300 జీతాన్ని బల్దియా చెల్లిస్తోంది. అయితే, సమ్మర్ క్యాంపులకు వచ్చే పిల్లల కోసం ఈ సంఖ్య సరిపోదు కాబట్టి ప్రత్యేకంగా 997 మంది హానరరీ కోచ్ లను జీహెచ్ఎంసీ నియమించింది. నెలరోజులు మాత్రమే వీరు కోచింగ్​ ఇస్తారు. వీరికి జీతం ఇవ్వడం లేదు. కేవలం ఒక ట్రాక్​, జత షూజ్ మాత్రమే ఇస్తోంది. 

ఆన్​లైన్​లో బుక్​ చేస్తే పట్టించుకుంటలేరు..

ఎవరైనా తమ పిల్లలకు కోచింగ్​ఇప్పించాలనుకుంటే స్పోర్ట్స్​ జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్టరై బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఏ సెంటర్​లో కోచింగ్​ తీసుకోవాలనుకుంటున్నారో అక్కడికి వెళ్లి ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. వీటి ఫీజు మినిమం రూ. రూ.10, రూ.50 వరకు ఉంది. ఆన్​లైన్​లో బుక్ చేసుకుని ఆ స్లిప్ ​తీసుకు వెళ్లి మెన్షన్​చేసిన సెంటర్​లో ఇస్తే జాయిన్​ చేసుకుని కోచింగ్​ఇవ్వాలి. అయితే, కొన్ని సెంటర్లలోనే ఇది అమలవుతోంది.

ఇందిరా పార్కు వద్ద జరుగుతోంది ఇది.. 

ఇందిరాపార్కులోని రోలర్ స్కేటింగ్ నేర్చుకోవడానికి దాదాపు 150 మంది వరకు వస్తున్నారు. సమ్మర్ క్యాంపు కాబట్టి నెలరోజుల కోసం రూ.50 మాత్రమే తీసుకోవాలి. అదే రెగ్యులర్​ కోచింగ్​కు అయితే నెలకి రూ.300 మాత్రమే..కానీ ఇందిరా పార్కు కోచింగ్ ​క్యాంప్​వద్ద ఆఫ్​లైన్​లో బుక్​ చేసుకోవాలని వచ్చేవారి నుంచి రూ.2 వేల నుంచి రూ.2500 వరకు తీసుకుంటున్నారు. 

ఆన్​లైన్​ బుక్​ చేసుకుని వస్తే స్లాట్స్​ ఫుల్​ అయిపోయాయని చెప్తున్నారు. అలాగే షూస్, యూనిఫామ్ కూడా తమ దగ్గరే తీసుకోవాలని కోచ్​లు పేరెంట్స్ పై ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడ స్కేటింగ్​ షూస్​ ను కూడా రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు అమ్ముతున్నట్టు తెలుస్తోంది.  

డుమ్మాలు కొడుతున్న కోచ్​లు 

కోచ్​లు ఏదైనా అవసరం ఏర్పడి రాకపోతే ఇన్​చార్జీలకు సమాచారం ఇవ్వాలి. అయితే, చాలా చోట్ల కోచ్​లు చెప్పక చేయక డుమ్మాలు కొడుతున్నారు. దీంతో పిల్లలు తమకు నచ్చింది చేసుకుని పోతున్నారు. అమీర్​పేటలోని సెంటర్​లో ఓ   కోచ్​​మూడు, నాలుగు రోజులుగా రాకపోవడంతో కోచింగ్​కు వచ్చే ఓ పదేండ్ల పిల్లాడే మిగతా పిల్లలకు నేర్పిస్తున్నాడు. కోచ్​కు ఫోన్​చేసినా లిఫ్ట్​చేయడం లేదని తెలుస్తోంది. సాయంత్రం కొంతమంది ఆఫీసర్లు నేర్చుకోవడానికి వస్తుండడంతో వారికి స్పెషల్​ ట్రైనింగ్​ ఇవ్వడానికి మాత్రమే వస్తున్నట్టు తెలిసింది.   

ఉదయమో గంట...సాయంత్రమో గంట

క్యాంపుల్లో మంగళవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోచింగ్ ఇస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. కానీ, ఎక్కడా ఈ టైమింగ్స్​అమలు కావడం లేదు. ఉదయం ఆరున్నర దాటితే కానీ, కోచింగ్​మొదలు కావడం లేదు. అది కూడా ఎనిమిది గంటల్లోపే  కంప్లీట్ ​చేసి పంపిస్తున్నారు.  

సాయంత్రం కూడా ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల శని, ఆదివారాల్లో కోచ్​లు, సిబ్బంది రాక స్టూడెంట్స్ వచ్చి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో ఎవరూ రెగ్యులర్​గా రావడానికి ఆసక్తి చూపడం లేదు.  

 క్యాంపుల్లో నో స్విమ్మింగ్....

సమ్మర్​లో స్విమ్మింగ్ కు డిమాండ్ ఉన్నా బల్దియా మాత్రం కోచింగ్ ​ఇవ్వడం లేదు. స్విమ్మింగ్ కోసం రెగ్యులర్​ ఫీజు రూ.500 తీసుకుంటోంది. ఇంత చెల్లిస్తున్నా సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. క్యాంపులు స్టార్టయిన వారానికే విజయననగర్ కాలనీలోని స్విమ్మింగ్ పూల్ మోటర్ ​పాడైంది. దీంతో రెండు రోజులు పూల్​బంద్​చేయాల్సి వచ్చింది. అమీర్ పేట్ లోని గురు గోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నీటి సౌకర్యం లేకపోవడంతో స్విమ్మింగ్ పూల్ ఓపెన్​చేయలేదు.

అమీర్​పేటలోనూ దందా...

అమీర్ పేటలోని గురు గోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఇష్టారాజ్యం నడుస్తోంది. రెండు రోజుల కింద ఓ కుటుంబం రోలర్ ​స్కేటింగ్ ​కోసం స్లాట్​బుక్​చేసుకొని వెళ్తే ఫుల్ అయిపోయారని  సమాధానం చెప్పారు. రెగ్యులర్​ కోచింగ్​ఇస్తామని, రూ.1000 అవుతాయని చెప్పారు. ప్రశ్నిస్తే రెండు రోజుల తర్వాత  కన్ఫమ్​ చేస్తామన్నారు. ఇక్కడే జిమ్నాస్టిక్స్​నేర్చుకునేందుకు స్లాట్​ బుక్ ​చేసుకుని వెళ్లిన పేరెంట్స్​ కి వింత అనుభవం ఎదురైంది. 

బుకింగ్​ పేపర్​ చూపించగా అప్పటికే 200 మంది పిల్లలు ఉన్నారని, జాయిన్ ​చేసుకోవడానికి నిరాకరించారు. రూమ్​లో పది షీట్స్​వేసి అందులో కేవలం ఐదుగురికి మాత్రమే కోచింగ్ ఇస్తుండడంతో, మిగతా 195 మంది ఎక్కడా అని ప్రశ్నించగా ‘ఈ రోజు రాలేదు ’ అని సమాధానమిచ్చారు. దాదాపు అన్ని కోచింగ్​ క్యాంపుల్లో ఇలాగే జరుగుతోందన్న ఆరోపణలున్నాయి.